డీసీసీబీ చైర్మన్​కు పదవీ గండం !

  •     గొంగిడి మహేందర్​రెడ్డిపై డైరెక్టర్ల తిరుగుబాటు
  •     డీసీవోకు అవిశ్వాస తీర్మానం నోటీసు
  •     ఈనెల 28న అవిశ్వాసం ఓటింగ్​
  •     ఆలోపు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆలోచన 

నల్గొండ, వెలుగు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త, డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డికి పదవీ గండం ఏర్పడనున్నట్లు  తెలిసింది. చైర్మన్​కు వ్యతిరేకంగా డీసీసీబీ డైరెక్టర్లు సోమవారం డీసీవో కిరణ్​కుమార్​కు అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేశారు. పాలకవర్గంలో 19 మంది డైరెక్టర్లుగా ఉండగా, 14 మంది చైర్మన్​కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. వైస్​ చైర్మన్​ ఏసిరెడ్డి దయాకర్​రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన రాలేదు. ఆయనతో కలిపితే అవిశ్వాస తీర్మానికి మద్దతు తెలిపే డైరెక్టర్ల సంఖ్య 15కు చేరనుంది. 

చైర్మన్​ పదవి నుంచి దించేందుకు సొసైటీ నిబంధనల మేరకు 2/3 వంతు మెజార్టీ కావాలి. మెజార్టీపరంగా ఇప్పుడున్న సంఖ్య అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈనెల 28న డీసీసీబీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​ ఉంటుందని డీసీవో తెలిపారు. దీనికంటే ముందుగానే చైర్మన్​ తప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. టెస్కాబ్ చైర్మన్, వైస్​ చైర్మన్ పై ఇదే రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టగా, అంతకంటే ముందుగానే వైస్​చైర్మన్​మహేందర్​రెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా మహేందర్​రెడ్డి జిల్లా బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

చక్రం తిప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..

మహేందర్​రెడ్డిని డీసీసీబీ చైర్మన్​పదవి నుంచి దింపడంలో మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి తెరవెనక చక్రం తిప్పారు. ఆయన సూచన మేరకు మునుగోడు నుంచి డీసీసీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కుంభం శ్రీనివాస్​రెడ్డి చైర్మన్​రేసులో దిగారు. బీఆర్ఎస్​డైరెక్టర్లతో మంతనాలు జరపడం, చైర్మన్​కు వ్యతిరేకంగా పావులు కదపడంలో సక్సెస్​అయ్యారు. అయితే, మహేందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరుతారని తొలుత ప్రచారం జరిగింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్​లో చేరితే వచ్చే దఫా టెస్కాబ్​స్టేట్​చైర్మన్​చేస్తామని ఆఫర్ ​కూడా ఇచ్చినట్టు తెలిసింది. 

ఒకప్పుడు జానారెడ్డి శిష్యుడైన మహేందర్​రెడ్డి కాంగ్రెస్​లోకి వస్తారనే భావించారు. ఆలేరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, రెండు సార్లు గెలుపొందిన అతడి భార్య సునీత పొలిటికల్​ కెరీర్, డీసీసీబీ చైర్మన్ పదవితోపాటు తన అనుచరుడు శ్రీకర్​రెడ్డికి డెయిరీ చైర్మన్​పదవులన్నీ మాజీ సీఎం కేసీఆర్​తమపై నమ్మకంతో అప్పగించారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి అన్యాయం చేయలేమని కాంగ్రెస్​ ఆఫర్​ను తిరస్కరించినట్టు ఆయన వర్గీయులు తెలిపారు. 

చైర్మన్​ ఏకపక్ష వైఖరి వల్లే అవిశ్వాస తీర్మానం : 

చైర్మన్​ఏకపక్ష నిర్ణయాల వల్లే ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందని డైరెక్టర్​ కుంభం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలకవర్గంలో తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి చర్చలు, సమీక్షలు లేకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో డైరెక్టర్లు ఇబ్బంది పడ్డారని తెలిపారు. జిల్లా మంత్రులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సపోర్ట్​కూడా తమకు ఉందన్నారు.