
సుడాన్ నియంత్రణపై ఆ దేశ సైన్యం, శక్తిమంతమైన పారామిలటరీ దళం మధ్య చెలరేగిన ఘర్షణ ఆ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీసింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో సుమారు 200 మందికి పైగా మరణించారు. సుడాన్ ఆర్మీలో ఆ దేశ పారామిలటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ను విలీనం చేసేందుకు ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా బుర్హాన్ ప్రతిపాదన చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ మహ్మద్ హమ్దాన్ దగాలో నేతృత్వంలోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ తిరుగుబాటు చేశాయి. దీంతో దేశంలో అంతర్యుద్ధం తలెత్తింది.
రాజధాని ఖర్దూమ్తోపాటు ఓందురుమన్, పశ్చిమ డార్ఫర్ ప్రావిన్స్, ఉత్తర డార్ఫన్ ప్రావిన్స్, కస్సాలా ప్రావిన్స్, అల్ ఖదారిఫ్ ప్రావిన్స్‌ల్లో సుడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య తుపాకులు, యుద్ధ ట్యాంకులతో పోరు జరుగుతోంది. సుడాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ కావేరి. పౌరులను వాయు, సముద్ర మార్గం ద్వారా తరలిస్తోంది. పోర్ట్ సుడాన్లో ఐఎన్ఎస్ సుమేధ ద్వారా భారత నావికాదళం ద్వారా ఎక్కువగా పౌరులను తరలిస్తున్నారు.