మనసుకి హాయినిచ్చే ఎత్తిపోతల 

ఎండాకాలంలో చల్లగా ఉండే... మనసుకి హాయినిచ్చే ప్లేస్​ల​కి వెళ్లాలనిపిస్తుంది. అందుకని ప్రకృతి ఒడిలో నీటి చప్పుడుతో ఆకట్టుకునే వాటర్​ఫాల్స్​ని చూసేందుకు వెళ్తారు చాలామంది. చుట్టూరా కొండలు, పచ్చనిచెట్లు... వాటి మధ్యలో నీళ్లని చూస్తూ సేదతీరుతారు. నేచర్ లవర్స్​, నేచర్​ ఫొటోగ్రాఫర్స్ ఇలాంటి ప్లేస్​లని చాలా ఇష్టపడతారు.  అలాంటిదే హైదరాబాద్​కి దగ్గర్లో ఉన్న నాగార్జున సాగర్ ఎత్తిపోతల ఫాల్స్ తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ ఇది. వీకెండ్​లో​ ఇక్కడికి  వెళ్తే మస్త్ ఎంజాయ్ చేయొచ్చు.

ఈ వాటర్​ఫాల్​ మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న గుంటూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్) లో ఉంది.  కృష్ణానదీ  ఉపనది అయిన చంద్రవంక నది మీద ఈ జలపాతం ఉంది. చంద్రవంక వాగు, నక్కల వాగు, తుమ్మల వాగు... ఈ మూడు వాగులు ఒకచోట కలిసి ఈ ఎత్తిపోతల జలపాతం ఏర్పడుతుంది. ఇక్కడ 70 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకి దుంకుతాయి. ఈ నీళ్లతో ఏర్పడిన సరస్సులో మొసళ్లను పెంచుతున్నారు. ఈ జలపాతం నీళ్లు 3 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కృష్ణా నదిలో కలుస్తాయి. ఈ వాటర్​ఫాల్​ని చాలా దగ్గరగా చూడాలనుకునే వాళ్లకోసం  పక్కనే ఉన్న కొండ మీద వ్యూ పాయింట్​ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్​ టూరిజం డిపార్ట్​మెంట్. అక్కడ నిల్చుని రాళ్ల దొంతరల మీద నుంచి కిందకి దుంకుతున్న నీళ్లని చూడడం బాగుంటుంది.   

ట్రెక్కింగ్ కూడా..

ఏడాదంతా ఈ వాటర్​ఫాల్​ నీళ్లతో కళకళ లాడాలని  నాగార్జున సాగర్ కుడి కాల్వ (జవహర్​ కాల్వ) నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా పంపిస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి వీకెండ్​లో ఇక్కడికి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాటర్​ఫాల్​ కింద​ కొంచెం దూరంలో దత్తాత్రేయ స్వామి, రంగనాథస్వామి దేవాలయాలు ఉంటాయి. అంతేకాదు కొన్ని  గుహలు కూడా కనిపిస్తాయి. పచ్చని చెట్లు, కొండ లతో ఉన్న ఈ ప్లేస్​లో  ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు.

ఇలా వెళ్లాలి

ఎత్తిపోతల జలపాతం నాగార్జునసాగర్​ డ్యాం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. నల్గొండ నుంచి దాదాపు 77 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే 187 కిలోమీటర్ల జర్నీ. 
ఎంట్రీ టికెట్: పిల్లలకు 15 రూపాయలు. పెద్దవాళ్లకు 20 రూపాయలు. టైమింగ్స్: ఉదయం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు. కెమెరాలు తీసుకెళ్లొచ్చు.