బ్రేన్ ​ఎంటర్​ప్రైజెస్ బాధితులకు న్యాయం చేస్తం : శ్రీధర్​ బాబు

  • సంస్థ తొలగించిన 3 వేల మంది ఉద్యోగులకు అండగా ఉంటాం

బషీర్ బాగ్, వెలుగు: బ్రేన్ ఎంటర్ ప్రైజెస్  బాధితులకు అండగా ఉంటామని ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్  మైదానంలో అఖిల భారతీయ ప్రొఫెషనల్స్  కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్  ప్రవీణ్  చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా విచారణ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ,  పీసీసీ చీఫ్   మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... బ్రేన్  ఎంటర్ ప్రైజెస్  బాధితుల సమస్యలను , బాధను వినేందుకు తాను ఇక్కడికి వచ్చానన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఐటీని ప్రమోట్  చేసే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, గత 3 దశాబ్దాలుగా ఐటీపై కాంగ్రెస్  ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. బ్రేన్  ఎంటర్ ప్రైజెస్  తొలగించిన 3 వేల మంది బాధిత ఉద్యోగులకు తాము అండగా నిలుస్తామన్నారు. బాధితులు తనకు ఇచ్చిన వినతిపత్రంలో ఐదు ప్రధాన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. 

యువతను మోసంచేస్తే  చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధిత ఉద్యోగులు కొద్దీ రోజుల ముందే సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చి ఉంటే, సమస్యకు పరిష్కారం చూపేవారమని తెలిపారు . అయినప్పటికీ బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  అయితే, తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని, తాము ఫెసిలిటేటర్ గా ఉంటామని మంత్రి చెప్పారు. 

అఖిల భారతీయ ప్రొఫెషనల్స్  కాంగ్రెస్  చైర్మన్  ప్రవీణ్  చక్రవర్తి మాట్లాడుతూ... బ్రేన్ ఎంటర్ ప్రైజెస్  యాజమాన్యం ఉద్యోగులను మోసం  చేసిందని, వారికి న్యాయం చేసే దిశగా ఏఐపీసీ ప్రజా విచారణ నిర్వహించిందన్నారు. ఈ సంస్థ సత్యం రామలింగరాజు కుటుంబానికి చెందినదని తమకు సమాచారం ఉందన్నారు. ప్రోగ్రామ్​లో 250 మంది బాధిత ఉద్యోగులు పాల్గొన్నారు.