హైదరాబాద్ లో ఈస్ట్​ వైపు చూడండి

హైదరాబాద్ లో  ఈస్ట్​ వైపు చూడండి
  • హైదరాబాద్​ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తం: మంత్రి శ్రీధర్​బాబు
  • తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి​ చేస్తం
  • కొత్త పరిశ్రమలను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయిస్తం
  •  ఐటీ హబ్​ల ఏర్పాటుపై చర్చిస్తున్నం
  • క్రెడాయ్​ ప్రాపర్టీ షోలో మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్​, వెలుగు:  నగరంలోని తూర్పు ప్రాంతంపైనా రియల్టర్లు దృష్టి సారించాలని, తమ ప్రభుత్వం రియల్ ఎస్టేట్​కు అన్ని విధాలా సహకరిస్తుందని రాష్ట్ర, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్​ బాబు అన్నారు. నగరంలోని నాగోల్​లో క్రెడాయ్​ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలో రియల్టీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.ఏ కంపెనీ వచ్చినాఈస్ట్ వైపు నిర్మిస్తామని, ఐటీ హబ్‎లు కూడా ఈస్ట్ హైదరాబాద్ వైపు వచ్చేలా చూస్తామని స్పష్టం చేశారు.  స్టార్​హోటళ్లు, కన్వెన్షన్‌‌ సెంటర్ల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రితో చర్చిస్తున్నామని చెప్పారు.

 ఈ ప్రాంతంలో ఐటీ పార్క్​ను నిర్మించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, క్రెడాయ్​కు ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టాళ్లను పరిశీలించారు.   హైదరాబాద్‎లో అన్ని రకాల వసతులున్నాయని.. డెవలపర్స్ ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో  నిర్మాణాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లాగ తాము మాట మార్చబోమని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.  నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. .

అన్ని రకాల ఆస్తుల ప్రదర్శన

ఈ  ప్రాపర్టీ షోలో  బండ్లగూడ(తూర్పు), బోడుప్పల్, ఘట్‌‌కేసర్, హబ్సిగూడ, కుషాయిగూడ, ఎల్‌‌బి నగర్, మన్సూరాబాద్, మేడిపల్లి, నాచారం, నాగారం, నాగోల్, పద్మారావునగర్, పీర్జాదిగూడ, పోచారం, సైదాబాద్, సైనిక్‌‌పురి, సరూర్‌‌నగర్, తార్నాక, ఉప్పల్‌‌, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లోని అపార్ట్‌‌మెంట్ కాంప్లెక్స్‌‌లు, విల్లాలు, విలాసవంతమైన భవనాలు, ప్లాట్లను ప్రదర్శిస్తున్నామని క్రెడాయ్​ తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెసిడెంట్  వి.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ "చురుకైన పాలన వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్  అభివృద్ధి చెందుతోంది.  సీఎం  రేవంత్ రెడ్డి ఇటీవలి విదేశీల పర్యటన ద్వారా రూ. 31,500 కోట్ల  పెట్టుబడిని సమీకరించారు. వీటి వల్ల  రియల్​ ఎస్టేట్​ ఎంతో అభివృద్ధి చెందుతుంది. గత  పది క్వార్టర్​లో ఆఫీస్ లీజింగ్ 27 శాతం పెరిగింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పెరుగుతున్నాయి. రియల్టీ లావాదేవీలు అధికమవుతున్నాయి. తక్కువ  అద్దెలు,   సదుపాయాలు ఇందుకు కారణం”అని ఆయన వివరించారు.
 

మరిన్ని వార్తలు