పాలమూరు, వెలుగు : పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ బాలికల ఐటీ కాలేజీ ఆవరణలో నిర్మిస్తున్న అదునాతన సాంకేతిక కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. టాస్క్ సెంటర్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు.
పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ ఆఫీస్‌ను ప్రారంభించి, దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్క్‌ను సందర్శించారు. అమరరాజా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం మంత్రి శ్రీధర్‌రాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలన్న ఉద్దేశంతో 65 ఐటీఐ కాలేజీలను టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యంతో ఏటీసీ సెంటర్లుగా మారుస్తున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో ‘టాస్క్’ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్‌లో స్కిల్ యూనివర్సిటీకి చెందిన ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిట శ్రీహరి, కలెక్టర్ విజయేందిర బోయి, ఆడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ విజయకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.