కారు దిక్కు కాకుండా.. వేరే దిక్కు చూస్తే కండ్లు పోతయ్ : కేటీఆర్

హుజూరాబాద్/ పెద్దపల్లి/ధర్మపురి, వెలుగు: ఈ నెల 30న అందరూ కారు దిక్కు చూడాలని, వేరే దిక్కు చూస్తే కండ్లు పోతాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ధర్మపురి, హుజూరాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్​షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినా కాంగ్రెస్ అడ్డుకున్నదని ఆరోపించారు. 

రైతుబంధు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కేసీఆర్ కోరితే అనుమతి ఇచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లు మళ్లీ లెటర్లు రాసి పర్మిషన్ వెనక్కి తీసుకునేలా చేసిన దుర్మార్గులని విమర్శించారు. రైతుల నోటి కాడికొచ్చిన బుక్కను రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు వస్తుందా? అందరూ ఆలోచించాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి కనీసం నకలు కొట్టే తెలివి కూడా లేదని, అలాంటిది రాష్ట్రాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు. సిలిండర్ కు మొక్కి తనకు ఓటు వేయమన్న మోడీ.. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచారని మండిపడ్డారు.

గో బ్యాక్ కేటీఆర్..  ప్లకార్డుల ప్రదర్శన

రోడ్ షో తర్వాత హెలిప్యాడ్ దగ్గరకు వెళ్తున్న కేటీఆర్ కు నిరసన ఎదురైంది. కేటీఆర్ గోబ్యాక్ అంటూ పాశిగామ రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘‘కాళేశ్వరం లింక్ టు ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం? ప్రభుత్వానికా, మీ ఫామ్ హౌజ్​కా..? మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ కా?.. కటింగ్ లేకుండా వడ్లు కొనే దమ్ముందా?”అని ప్లకార్డులు ప్రదర్శించారు.