నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పర్యటించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కొంతమంది నాయకులు ఎలక్షన్స్ రాగానే గ్రామాల్లోకి వస్తారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కొంతమంది ఆగమగమవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్.
బీజేపీ, కాంగ్రెస్ లో ఏది చేసినా ఢిల్లీకి వెళ్లాలని, చివరకు వాష్ రూమ్ కు వెళ్లాలన్నా ఢిల్లీకే వెళ్లాలంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఈ గబ్బుగాళ్లు నలుగురు ఒక దగ్గర కూర్చోలేరు గానీ.. కేసీఆర్ ను ఓడగొట్టి.. పీకి పందిరేస్తామంటూ లొల్లి పెడుతున్నారని అన్నారు. ఢిల్లీ బానిసలైన కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీ రాబోయే ఎన్నికలు అని అన్నారు. పౌరుషం ఉన్న ప్రజలు తెలంగాణపై వాలే గద్దలను ఒక్కొక్కటిగా తరిమికొట్టాలని చెప్పారు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. 70 ఏళ్లు ఉన్న కేసీఆర్ ను కొంతమంది నాయకులు (రేవంత్, అర్వింద్) ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇకనైనా పద్దతిగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారని, వచ్చే ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయన డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయమని చెప్పారు. ఎంపీ అర్వింద్ .. నిత్యం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు తప్ప ఒక్కటైనా మంచి పనులు చేశారా..? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకనే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు రాలేదని విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, వాటికి సమాధానం చెప్పే ముఖం అర్వింద్ కు ఉందా..? అన్ని ప్రశ్నించారు
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.400 కు పెంచితే.. ఇష్టం వచ్చినట్లు మోదీ తిట్టారని అన్నారు. ప్రజలందరూ గ్యాస్ బండకు మొక్కి ఆ ప్రధానిని ఇంటికి పంపించండి అని చెప్పారని తెలిపారు. మోదీ దయతో ఇవాళ సిలిండర్ ధర 400 నుంచి 1200 రూపాయలకు చేరిందన్నారు. బీజేపీ వాళ్లు అడ్డుపడితే.. వారికి గుండు కొట్టి డిపాజిట్లు గల్లంతు చేసి మోడీకి, బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ను 115 కి చేశారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర సరకుల ధరలు పెరగవా..? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. అన్నింటిని పిరం చేసిన ప్రధానమంత్రికి ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. పిరం చేసిన బీజేపీని గల్లీలో గల్లా బట్టి నిలదీయాలన్నారు. ఈ తొమ్మిదేళ్లలో హిందూ, ముస్లింలకు మధ్య పంచాయతీ పెట్టడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు.
రేవంత్ పైనా విసుర్లు
50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి పనులను ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా..? అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారని సెటైర్లు వేశారు. హంతకుడే సంతాపం చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు తమను ప్రశ్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి అని చెప్పారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ వచ్చి అబద్దాలు చెబితే మళ్లీ ఆగమవుదామా..? ఆలోచించుకోండి అని ప్రశ్నించారు. సంచలన నాయకుడు కేసీఆర్ అయితే.. సంచులు మోసే నాయకుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడారు.
మరోవైపు.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తపై ప్రశంసల జల్లు కురింపించారు మంత్రి కేటీఆర్. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా చాలా అభివృద్ధి చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. గతంలో నిజామాబాద్ అర్బన్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచినా... వాళ్లు చేయని అభివృద్ధి పనులను గణేష్ గుప్తా తొమ్మిదేళ్లలోనే చేశారని చెప్పారు. గణేష్ లాంటి ఎమ్మెల్యేలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందర్నీ రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోని 60 డివిజన్లకు రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభలోనే ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో గణేష్ గుప్తాకు 55 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ఎక్కువగా వరి ధాన్యం పండుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ పరిపాలనలో ప్రతి వర్గం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 రేట్లు పెన్షన్లు పెరిగాయన్నారు. పట్టణాలు, పల్లెలు బాగుపడుతున్నాయని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే అప్పుడే ప్రజలకు ఎమ్మెల్యేలు గుర్తుకు వస్తారని అన్నారు. కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే గణేష్ గుప్తా బాగా ఆదుకున్నారని చెప్పారు. మూడు వేల మందికి 41 రోజుల పాటు భోజనాలు పెట్టారని తెలిపారు. కమిట్ మెంట్ ఉన్న నాయకులు ఉంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గతంలో 27 వేల మెజార్టీతో గెలిచారని, ఈసారి 55 వేల ఓట్ల మెజార్టీతో గణేష్ గుప్తను గెలిపించాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.
ఎమ్మెల్సీ కవిత ఇక్కడకు రాలేకపోయారని, అయితే.. తనతో ఒక విషయం చెప్పారని తెలిపారు మంత్రి కేటీఆర్. నిజామాబాద్ పట్టణం కోసం కేసీఆర్ దగ్గర కూర్చుని మరిన్నీ నిధులు తీసుకొచ్చే పనిలోనే ఉన్నానని, తన మనసు నిండా నిజామాబాద్ ఉందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని తనకు కవిత చెప్పారని తెలిపారు.