మెట్రో రైళ్లకు ఆరు కోచ్​లు ఏర్పాటును పరిశీలిస్తున్నం : మంత్రి శ్రీధర్​బాబు

మెట్రో రైళ్లకు ఆరు కోచ్​లు ఏర్పాటును పరిశీలిస్తున్నం : మంత్రి శ్రీధర్​బాబు
  • శాసన మండలిలో ప్రతిపక్షాల ప్రశ్నలకు బదులిచ్చిన ప్రభుత్వం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైళ్లలో  ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్నందన, దీనికి అనుగుణంగా ప్రస్తుతమున్న మూడు కోచ్​ల స్థానంలో ఆరు కోచ్​లు పెట్టి నడిపే విషయాన్ని ప్రభుత్వ పరిశీలిస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు. గురువారం శాసన మండలిలో సభ్యులు జీవన్​రెడ్డి, అమీర్​అలీఖాన్​ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 

హైదరాబాద్​ మెట్రో 3 కోచ్​ల రైళ్లను నడపడానికి రెడీ చేశామన్నారు. వీటిని ఆరు కోచ్​ల రైళ్లుగా నడపడానికి మార్పు చేయవచ్చన్నారు. కానీ హైదరాబాద్ ​మెట్రో డిజైన్​ 8  కోచ్​లను నడపడానికి అనుమతించదన్నారు. అన్ని ఇతర మెట్రోల లాగా కాకుండా హైదరాబాద్​ మెట్రో పీపీపీ పద్ధతిన నిర్మించిన ప్రాజెక్టు అని గుర్తుచేశారు.  హైదరాబాద్​ మెట్రో అమలు, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్​ కన్సెషనర్​ఎల్అండ్ ​టీ చేపడుతోందన్నారు.  

మరిన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేస్తం: సీతక్క 

రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల కోసం మరికొన్ని కొత్త ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ)లను ఏర్పాటు చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు శాసన మండలిలో బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం 21 మైదాన ప్రాంతా జిల్లాలకు వర్తింపజేస్తూ హైదరాబాద్​లోని ఐటీడీఏ ప్లెయిన్​ ఏరియా పని చేస్తున్నదన్నారు. శ్రీశైలం ఐటీడీఏలో భాగమైన మన్ననూరు ఐటీడీఏను రాష్టం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయగా.. 

ప్రస్తుతం నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్ జిల్లాలతోపాటు చెంచులు నివసిస్తున్న వికారాబాద్​, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో తమ కార్యకలాపాలను విస్తరించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క స్పష్టం చేశారు. ఇమామ్, మౌలానాలకు నెలకు రూ.5 వేలు చెల్లిస్తున్నట్టు తెలిపారు.  

మూసీపై వరల్డ్ ​బ్యాంక్​కు డీపీఆర్ ​ఇయ్యలే

మూసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం వరల్డ్​బ్యాంక్​కు ఎలాంటి డీపీఆర్​ ఇవ్వలేదని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత సభను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైర్​అయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్​ నియామకం జరిగిందని, 2.5% వడ్డీకే లోన్​ ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్  సిద్ధంగా ఉందన్నరు. 

కానీ, గత  బీఆర్ఎస్  ప్రభుత్వం పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ నుంచి 11.5% వడ్డీకి అప్పులు తీసుకొని, ప్రభుత్వంపై భారం మోపిందన్నారు. పదేండ్లలో ప్రపంచ బ్యాంకు నుంచి తక్కువ శాతం వడ్డీకి బీఆర్ఎస్​ ఎందుకు రుణం తీసుకోలేదని నిలదీశారు. కవిత మాట్లాడుతూ, సెప్టెంబరులో వరల్డ్​ బ్యాంక్​కు లోన్​ కోసం అప్లై చేసినప్పుడు ‘డీపీఆర్’ ఉన్నట్లు పేర్కొన్నారు కదా? అని అడగగా, అది డీపీఆర్​ కాదని,​ డిజైన్​ ఇంజినీరింగ్​అని శ్రీధర్​బాబు చెప్పారు.