ఒలింపిక్స్​లో పతకాలే లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీ

ఒలింపిక్స్​లో పతకాలే లక్ష్యంగా స్పోర్ట్స్ వర్సిటీ
  • అన్ని స్పోర్ట్స్ స్కూల్స్​ను అనుసంధానం చేస్తాం: శ్రీధర్ బాబు
  • గత బీఆర్ఎస్ సర్కార్ క్రీడలను పట్టించుకోలేదు
  • జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో మంత్రి కామెంట్

గచ్చిబౌలి, వెలుగు: ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్​లో పతకాలు సాధించాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్​చంద్ జయంతిని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొని ధ్యాన్​చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 తర్వాత హాకీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. క్రీడలను నిర్వీర్యం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్టేడియాలు, స్పోర్ట్స్ స్కూల్స్​ను అనుసంధానం చేస్తం’’అని శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల సీఎంతో కలిసి తాను సౌత్ కొరియాలోని ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించినట్లు తెలిపారు. 

‘‘సౌత్ కొరియాకు ఒలింపిక్స్​లో 36 పతకాలు వచ్చాయి. అందులో 18 పతకాలు ఒకే స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన క్రీడాకారులు దక్కించుకున్నారు. అక్కడ ఇచ్చే ట్రైనింగ్​ను మన రాష్ట్రంలోని క్రీడాకారులకు ఇచ్చేలా చూస్తాం. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్​కు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒలింపిక్స్​లో పాల్గొన్న ఇషాసింగ్ కు రూ.5లక్షల క్యాష్ ప్రైజ్ ఇచ్చాం’’అని శ్రీధర్ బాబు అన్నారు. 

తర్వాత ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీతలను మంత్రులు సన్మానించారు. ఇటీవల ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రీడల్లో గెలిచిన టీఎన్జీవోస్, ఎన్జీవో, సెక్రటేరియెట్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాలా, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్​ఠాకూర్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి పాల్గొన్నారు.