ఏఐ, మోడర్న్​ టెక్నాలజీకి హైదరాబాద్​ గ్లోబల్​ హబ్​: మంత్రి శ్రీధర్​ బాబు

ఏఐ, మోడర్న్​ టెక్నాలజీకి హైదరాబాద్​ గ్లోబల్​ హబ్​: మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ), మోడర్న్​ టెక్నాలజీకి హైదరాబాద్​ గ్లోబల్​ హబ్​గా వృద్ధి చెందుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. ప్రతిభ కలిగిన యువత, మంచి మౌలిక వసతులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, అందుకే కొత్త సంస్థలు సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. ఆదివారం ఏఐ సర్వీసెస్​, క్లౌడ్​ కంప్యూటింగ్, డేటా డెలివరీలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన డేటా ఎకానమీ సంస్థ కొత్త వర్క్​ స్టేషన్​ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్వాంటమ్​ కంప్యూటింగ్, డిజిటల్​ ట్విన్స్, డేటా ట్రాన్స్​ఫర్​ రంగాల్లో సంస్థ మంచి అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. 

సంస్థ విస్తరణకు ప్రభుత్వం నుంచి తమ వంతు సాయం చేస్తామని చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్ వేర్ సంస్థలు విస్తరించాలని కోరుకుంటున్నట్టు  పేర్కొన్నారు. స్టార్టప్​ కంపెనీలు, ఏఐ, క్వాంటమ్​ కంప్యూటింగ్​ కేంద్రాలు, డేటా సెంటర్లు భారీ సంఖ్యలో ఏర్పాటవుతుండడంతో యువతకూ ఉపాధి పెరుగుతుందన్నారు. ఏఐ సిటీ అభివృద్ధిలో డేటా ఎకానమీ భాగస్వామి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాద్​లో మరో 500 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తామని డేటా ఎకానమీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.