భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి వ్యాప్తంగా ఐటీ నెట్ వర్క్ మేనేజ్మెంట్ సిబ్బంది మంగళవారం మెరుపు సమ్మెకు దిగారు. ఓం సిస్టమ్స్అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో సింగరేణిలో యాన్యువల్ మెయింటెనెన్స్ ద్వారా ఐటీ నెట్ వర్క్ సేవలను అందిస్తుంది. ఇటీవలి కాలంలో కాంట్రాక్ట్ పనులను ఈ ఏడాది కూడా సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థలో సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేపట్టారు.
జీతభత్యాలు, క్యాజువల్ లీవ్‌లు, ఓటీ లాంటి బెనిఫిట్స్‌ను కాంట్రాక్ట్ అవార్డులో పొందుపర్చకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని సిబ్బంది పేర్కొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తాము సమ్మెలోకి వెళ్లామని సిబ్బంది పేర్కొన్నారు. సిబ్బంది న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తరఫున పోరాడుతామని యూనియన్ నాయకులు వంగా వెంకట్, ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు.