బీఆర్ఎస్ లీడర్లకు ఐటీ నోటీసులు!

బీఆర్ఎస్ లీడర్లకు ఐటీ నోటీసులు!

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డి ఇండ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు.. శుక్రవారం రాత్రి ఒంటిగంట వరకు కొనసాగాయి. సోదాల్లో స్వాధీనం చేసుకున్న అనుమానిత డాక్యుమెంట్స్, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ ఆధారంగా పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్ ఫతేమైదాన్‌‌‌‌లోని ఐటీ ఆఫీస్‌‌‌‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. శేఖర్ రెడ్డితో పాటు జనార్దన్‌‌‌‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఈ ముగ్గురికి సంబంధించిన కంపెనీలు, ఆఫీసులు, ఇండ్లు సహా మొత్తం63 ప్రాంతాల్లో ఐటీ మూడ్రోజుల పాటు సోదాలు జరిపింది. 

కొత్తపేట గ్రీన్‌‌‌‌హిల్స్‌‌‌‌ కాలనీలోని శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇల్లు, ఆఫీసులు.. జూబ్లీహిల్స్‌‌‌‌లోని మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డి ఇల్లు, ఆఫీసులు, జేసీ బ్రదర్స్ బ్రాంచీల్లో తనిఖీలు చేసింది. ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, వాళ్ల కుటుంబ సభ్యుల ఇండ్లలోనూ సోదాలు చేసింది. సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ పరిశీలించారు. లాకర్స్‌‌‌‌లోని డాక్యుమెంట్స్‌‌‌‌, ఐటీ చెల్లింపుల్లో వ్యత్యాసాలు గుర్తించారు. రియల్ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. బ్యాంక్ లాకర్స్‌‌‌‌లో బంగారు ఆభరణాలు గుర్తించినట్లు సమాచారం. వాటి కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించాలని సూచించినట్లు తెలిసింది.

ఇది కక్ష సాధింపు: శేఖర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డి

ఐటీ అధికారుల సోదాలపై ఎమ్మెల్యే శేఖర్‌‌‌‌ ‌‌‌‌రెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. విదేశాల్లో ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. గత 25 ఏండ్లుగా రియల్ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సోదాల్లో ఐటీ అధికారులకు సహకరించానని చెప్పారు. తన సీఏ అన్ని వివరాలు వెల్లడించారని పేర్కొన్నారు. తనకు నోటీసులు ఇచ్చారని, 20న విచారణకు రమ్మన్నారని వెల్లడించారు.