- రియల్ ఎస్టేట్ లెక్కల్లో అవకతవకలు
- కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్/షాద్‌నగర్, వెలుగు: రియల్ ఎస్టేట్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఫోకస్ పెట్టింది. చెల్లింపుల్లో అవకతవకలు, బ్యాలెన్స్ షీట్లలోని తేడాలను గుర్తించి సోదాలు నిర్వహిస్తోంది. సోమవారం హైదరాబాద్‌లోని ప్రముఖ స్వస్తిక్ గ్రూప్కంపెనీలకు చెందిన కార్పొరేట్ ఆఫీసులు, చైర్మన్లు, ఎండీల ఇండ్లలో ఏక కాలంలో రైడ్స్చేసింది. ఐటీ అధికారులు బేగంబజార్‌లోని స్వస్తిక్ హోల్ సేల్ షాప్ సహా బంజారాహిల్స్, గచ్చిబౌలి, షాద్‌నగర్‌లో తనిఖీలు చేశారు. కంపెనీ మేనేజర్లు కల్పనా రాజేంద్ర, లక్ష్మణ్ ఇళ్లలోనూ సోదాలు చేసినట్టు తెలిసింది.
షాద్‌నగర్‌లోని రూ.300 కోట్ల విలువ చేసే భూమిని ఓ ఎంఎన్‌సీ కంపెనీకి విక్రయించిన సమయంలో బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా ఐటీ అధికారులు సోదాలు చేశారు. భూముల విక్రయాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.