హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటక నుంచి భారీ మొత్తంలో తరలుతున్న ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తగిన ధ్రవీకరణ పత్రాలు లేకపోవడంతో 42 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. బెంగళూరులోని బైరే సంద్ర ప్రాంతంలోని ఆర్టీనగర్ ఆత్మానంద కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది.
దీంతో అలెర్టయిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంట్రాక్టర్ ఆర్ అంబికాపతి, ఆయన భార్య కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ అశ్వత్థామ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అంబికాపతి కర్నాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడని సమాచారం. అశ్వత్థామ 95వ డివిజన్ కార్పొరేటర్ గా సేవలందించారు. వాళ్ల ఇంట్లో వాడకంలో లేని ఓ రూములో పరుపు కింద దాచిన 22 అట్టపెట్టెల్లో 42 కోట్లు ఉన్నట్టు గుర్తించారు.
మొత్తంగా 50 కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే 8 కోట్ల రూపాయలు తరిలించినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.