- కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: అన్విత బిల్డర్స్ అండ్ ప్రాపర్టీస్ కంపెనీలో గురువారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 35 ప్రత్యేక బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఏపీ, తెలంగాణలోని అన్విత గ్రూప్‌కు చెందిన కార్పొరేట్ ఆఫీసులు, ఎండీలు, డైరెక్టర్ల ఇండ్లల్లో సోదాలు చేశారు. విదేశీ పెట్టుబడులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు కంపెనీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్‌పేట్, కొల్లూరులోని అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ ఆఫీసులు, సిబ్బంది ఇండ్లల్లో గురువారం తెల్లవారుజామున 6 నుంచే సోదాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆఫీసుల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.
భారీగా విదేశీ పెట్టుబడులు!
అన్విత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వాహకులు సింగపూర్, దుబాయ్‌లో ఇంటీరియర్ వ్యాపారం చేస్తున్నారు. విదేశాల్లో నిర్వహిస్తున్న వ్యాపారాల ద్వారా సమకూర్చిన డబ్బును అన్విత బిల్డర్స్ అండ్ ప్రాపర్టీస్‌లో పెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొల్లూరులో ప్రీ లాంచ్ ఆఫర్ ద్వారా భారీగా డిపాజిట్లు సేకరించినట్లు ఐటీ డిపార్ట్మెంట్ అనుమానిస్తున్నది. ఈ మేరకు అన్విత గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఏకకాలంలో దాడులు చేసింది.
సోదాల్లో సంస్థ ఆడిట్ రికార్డులు, కంపెనీ ఆదాయ వ్యవహారాల డాక్యుమెంట్లతో పాటు విదేశీ పెట్టుబడులకు సంబంధించిన రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.