హైదరాబాద్, వెలుగు: మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీల పన్ను ఎగవేత ఆరోపణల కేసులో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ విచారణ వేగవంతం చేసింది. కంపెనీల డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు సహా 12 మందిని సోమవారం విచారించింది. కంపెనీల ఆర్థిక లావాదేవీలు, ఐటీ చెల్లింపులకు సంబంధించిన రికార్డుల ఆధారంగా ప్రశ్నించింది. మొదటి రోజు విచారణలో మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన వివరాలు సేకరించింది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించింది. ఉప్పల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయన్న కారణంతో విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరుకాలేదు.
విద్యాసంస్థల కార్యకలాపాలపైనే ఫోకస్
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, బిజినెస్ పార్ట్‌నర్స్ ఆఫీసులు, ఇండ్లలో గత మంగళ, బుధవారాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.15 కోట్లకు పైగా క్యాష్, రూ.100 కోట్ల డొనేషన్లకు చెందిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటి ఆధారంగా మల్లారెడ్డితో పాటు మొత్తం16 మందికి ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి తమ్ముడు గోపాల్‌రెడ్డి, నర్సింహా రెడ్డి కాలేజెస్ చైర్మన్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ త్రిశూల్‌రెడ్డి, ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ డైరెక్టర్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రామస్వామిరెడ్డి, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీస్ డైరెక్టర్ శివకుమార్, ప్రిన్సిపాల్ మాధవి, ముగ్గురు అకౌంటెంట్స్ సోమవారం విచారణకు వచ్చారు. విద్యాసంస్థల కార్యకలాపాలపైనే ఫోకస్ చేసినట్లు తెలిసింది. అకౌంటెంట్లు ఆపరేట్ చేసిన రికార్డులను పరిశీలించారు. అనుమానం ఉన్న అకౌంట్స్‌కు సంబంధించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. వివరాలు లేని ట్రాన్సాక్షన్స్‌ను ఇన్‌కమ్ టాక్స్ ఫార్మాట్‌లో అందించాలని ఆదేశించారు.
ఫీజుల లెక్కలు, సీట్ల కేటాయింపులపై ఆరా
మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు మెడికల్, ఇంజినీరింగ్ ఫీజులు, సీట్ల కేటాయింపుల వివరాలను ఐటీ శాఖ సేకరిస్తున్నది. గత వారం జరిపిన సోదాల్లో అడ్మిషన్స్, ఫీజులు, ఫ్యాకల్టీ జీతాలు, నిర్వహణకు సంబంధించిన రికార్డుల్లో వ్యత్యాసాలను గుర్తించినట్లు సమాచారం. గత ఆరేండ్లుగా నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న సంస్థలు, వాటి ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు. ఏటా ఎడ్యుకేషన్ సొసైటీల ద్వారా సమకూరుతున్న ఆదాయంపై చెల్లించిన పన్నుల ఆధారాలు సేకరించారు. ఇందులో ఆదాయ, వ్యయాలు.. టాక్స్ చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విచారణకు సహకరిస్తున్నం: మల్లారెడ్డి
‘‘ఐటీ శాఖ నుంచి సమన్లు వచ్చాయి. విచారణకు సహకరిస్తున్నాం. నా చిన్న కొడుకు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సమన్లు అందుకున్న వాళ్లు ఐటీ విచారణకు హాజరయ్యారు. ఆఫీసర్స్ అడిగిన అన్ని డాక్యుమెంట్లను అందిస్తాం. ఉప్పల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో సోమవారం వెళ్లలేకపోయాను. నా తరఫున మా ఆడిటర్ వెళ్లారు” అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ‘‘ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాను. మేం ఇచ్చిన సమాచారంతో స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజ్‌లకు సంబంధించిన ఫీజులు, సీట్ల కేటాయింపు వివరాలను అందించాలని చెప్పారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తాం’’ అని భద్రారెడ్డి చెప్పారు.