హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం మణికొండ పంచవటి కాలనీలోని రోహిత్ రెడ్డి ఇల్లుతో పాటు వికారాబాద్, తాండూరు, హైదరాబాద్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తాండూరులోని దుర్గా హోటల్‌లోని రూమ్ నంబర్ 302లో సెర్చెస్ చేసి, రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రోహిత్ రెడ్డి అనుచరుడు శ్రవణ్ అడ్రస్ ప్రూఫ్స్‌తో రూమ్ బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ రూమ్‌లో హైదరాబాద్‌కు చెందిన షఫిక్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ అకౌంట్స్, మణికొండలోని ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. రోహిత్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరిపారు. హవాలా వ్యాపారులు, అనుచరులతో రోహిత్ రెడ్డి డబ్బులు సేకరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఓల్డ్ సిటీలోనూ తనిఖీలు..
ఓల్డ్ సిటీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులతో కలిసి రోహిత్ రెడ్డి వివిధ వ్యాపారాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కోహినూర్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ మాజీద్ ఖాన్, ఫలక్‌నుమాలోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ యజమాని షానవాజ్ ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రనగర్ శాస్త్రీపురం, కింగ్స్ కాలనీ, ఫలక్‌నుమా సహా పాత బస్తీలోని 8 చోట్ల అధికారులు సోదాలు చేశారు.