- పన్ను ఎగవేత ఆరోపణలతో 40 ప్రాంతాల్లో సోదాలు
- సెంట్రల్ ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: ఎస్పీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అత్తరు వ్యాపారులపై ఇన్ కమ్ ట్యాక్స్(ఐటీ) డిపార్ట్ మెంట్ దాడులు చేసింది. పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలతో శుక్రవారం పలు చోట్ల సోదాలు జరిపింది. అత్తరు వ్యాపారులు సహా పెట్రోల్ పంపులు, కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్స్ బిజినెస్ మెన్లపై రెయిడ్స్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్, కాన్పూర్, ఢిల్లీ, సూరత్, ముంబై సహా దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసింది. కన్నౌజ్‌కు చెందిన సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్ ఇంట్లోనూ సోదాలు జరిపింది. ఈయన అత్తరు వ్యాపారి. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జైన్.. ఇటీవల సమాజ్ వాదీ అత్తరును తయారుచేశారు. కాగా, ఇటీవల కాన్పూర్‌కు చెందిన అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేయగా, పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి.
జనమే జవాబు చెప్తరు: ఎస్పీ
ఐటీ దాడులపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది. ‘‘భారీ వైఫల్యం తర్వాత, బీజేపీకి చెందిన ఐటీ.. ఎస్పీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ సహా కన్నౌజ్‌లోని అత్తరు వ్యాపారులపై దాడులు చేసింది. బీజేపీ ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మామూలే. ఇదంతా జనం చూస్తున్నారు. వాళ్లే ఓటుతో జవాబు చెబుతారు” అని పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది.
పుష్పరాజ్ అనుకొని పీయూష్ ఇంటికి..
పుష్పరాజ్ జైన్, పీయూష్ జైన్లు కన్నౌజ్‌లో ఒకే ఏరియాలో ఉంటున్నారు. వీరిద్దరి ఇండ్లకు కొన్నిమీటర్ల దూరమే ఉంటుంది. ఇద్దరూ అత్తరు వ్యాపారులే. ఈ క్రమంలో పుష్పరాజ్ అనుకొని పీయూష్ జైన్ ఇంటిపై దాడి చేశారని ఎస్పీ పేర్కొంది. పీయూష్ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరకడం, అతనే సమాజ్ వాదీ అత్తరు తయారు చేశాడని వార్తలు రావడంతో ఎస్పీపై బీజేపీ విమర్శించింది. అయితే అత్తరు తయారుచేసింది పుష్పరాజ్ అని, బీజేపీ పొరపాటున తమ సొంత బిజినెస్ మెన్పైనే దాడి చేసిందని 3 రోజుల కిందటే అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు.