రెండోరోజు పొంగులేటి ఇళ్లల్లో ఐటీ రైడ్స్.. శ్రీనివాసరెడ్డి రూమ్ కీస్ కోసం అధికారుల వెయిటింగ్

మాజీ ఎంపీ, పాలేరు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 17లో ఉన్న 222/a ఇంట్లో,  పొంగులేటి బంధువు నందగిరిహిల్స్ లోని బంధువు ఇంట్లోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి..  పలు కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

పొంగులేటి రూమ్ కీస్ లేకపోవడంతో గురువారం (నవంబర్ 9) నుంచి కీస్ కోసం ఐటీ అధికారులు వెయిట్ చేస్తున్నారు. కీస్ మేడం వద్ద ఉన్నాయంటూ వాచ్ మెన్ ఐటీ అధికారులకు చెప్పాడు. గురువారం (నవంబర్ 9) ఖమ్మం నుంచి హైదరాబాద్ కు పొంగులేటి కుటుంబసభ్యులు వచ్చారు. పొంగులేటి రూమ్ ను  సోదాలు చేయాలంటూ ఆయన సతీమణికి ఐటీశాఖ అధికారులు ఫోన్ చేసి, కీస్ అడిగారు. 

పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఇండ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు గురువారం (నవంబర్ 9న) కూడా దాడులు చేశారు. ఖమ్మంలోని ఇల్లు, క్యాంప్ ఆఫీస్, రాఘవ కన్ స్ట్రక్షన్ ఆఫీస్, నారాయణపురంలోని ఇల్లుతో పాటు ఖమ్మంలోని బంధువుల ఇండ్లలోనూ సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, నందగిరిహిల్స్, వంశీరామ్ జ్యోతి హిల్ రిడ్జ్ లోని ఇండ్లు, బంజారాహిల్స్ లోని రాఘవ ప్రైడ్, బేగంపేటలోని ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 చోట్ల రెయిడ్స్ జరిపారు. ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 7 గంటలకు పూర్తయ్యాయి. శుక్రవారం (నవంబర్ 10న) కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. 

పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి భార్య మాధురి, కొడుకు హర్ష, తమ్ముడు ప్రసాద్​రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్​కు తరలించారు. సోదాల సమయంలో కుటుంబసభ్యులు, ఇంట్లోని సిబ్బంది నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల విషయం తెలియడంతో ఉదయం నుంచే ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి ఆయన అభిమానులు, కాంగ్రెస్​కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనిఖీల సమయంలో కొమ్మూరుకు చెందిన ఉపేందర్​అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్​పోసుకున్నాడు. పక్కనున్న కార్యకర్తలు వెంటనే అతన్ని అడ్డుకుని, ఒంటిపై నీళ్లు పోసి అక్కడి నుంచి తరలించారు. 

హైదరాబాద్​లో సోదాలు జరిపిన టైమ్ లో పొంగులేటి, ఆయన కుటుంబసభ్యులు ఖమ్మంలో ఉన్నారు. దీంతో ఇంట్లో ఉన్నోళ్లకు సమాచారమిచ్చి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పొంగులేటి కుటుంబసభ్యులు, ఆయన కంపెనీల సిబ్బంది ఇండ్లలోనూ తనిఖీలు జరిపారు. కంపెనీల సిబ్బంది ద్వారా బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించారు. ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.

పొంగులేటికి చెందిన పలు కన్ స్ట్రక్షన్, అగ్రికల్చర్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు సేకరించారు. గత ఐదేండ్లుగా ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. గత రెండు నెలల వ్యవధిలో శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారు. నామినేషన్ కు వెళ్లకుండా ఐటీ అధికారులు తనను అడ్డుకున్నారంటూ ఎలక్షన్​కమిషన్​కు ఆన్​లైన్​లో పొంగులేటి ఫిర్యాదు చేశారు. తన హక్కులకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఈసీని కోరారు.