హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు : 5 కోట్ల రూపాయల నోట్ల కట్టలు సీజ్

హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలో గుట్టలుగా డబ్బులు : 5 కోట్ల రూపాయల నోట్ల కట్టలు సీజ్

హైదరాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో 10  ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, కొత్త ఆర్థిక సంవత్సరం, రాబోయే విద్యా సంవత్సరం నేపథ్యంలో ఫీజుల వసూళ్లు, ఐటీ చెల్లింపులపై ఆరా తీస్తోంది ఐటీ. ఇందులో భాగంగా శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలు మంగళవారం (మార్చి 11) కూడా కొనసాగుతున్నాయి. 

ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్వేర్లను పరిశీలించారు. శ్రీ చైతన్య కాలేజీలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తున్నారు ఐటీ అధికారులు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన గత ఐదు సంవత్సరాల ఐటీ చెల్లింపుల వివరాల ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

 ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులో రెండు విధానాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించుకునే క్రమంలో అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఆధారాలు సేకరించినట్టు సమాచారం. 

ఇలా వసూలు చేసిన ఫీజులకు సంబంధించి ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఐటీ సోదాల్లో బయటపడినట్టు తెలిసింది. హైదరాబాద్ మాదాపూర్‎లోని శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్‎లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో 11 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజా సోదాల్లోనూ రూ.5 కోట్లు పట్టుబడటం గమనార్హం. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతోన్న దాడులపై ఐటీ అధికారులు ఇప్పటికే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.