మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి కార్యాలయంలో ఇన్ కం ట్యాక్స్ (ఐటీ) రైడ్స్ కొనసాగుతున్నాయి. సోమాజీగూడలోని వివేక్ నివాసం, మంచిర్యాలలోని నివాసంలోనూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సోదాలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేటలోని విశాక ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసులో మధ్యాహ్నం నుంచి సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఆరుగురు సభ్యులతో కూడిన ఐటీ బృందం ముందుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో విశాక ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసులోకి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు అధికారులు బయటకు వచ్చారు. మిగతా నలుగురు అధికారులు ఇంకా సోదాలు చేశారు. దాదాపు ఏడున్నర గంటల పాటు సోదాలు చేసి రాత్రి 10.45 సమయంలో ఆఫీసు నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు.. వివేక్ వెంకటస్వామి సోదరుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులు సోదాలు చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం జీ. వివేక్, వినోద్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నిక బరిలో నిలిచారు. చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడ్డారు. ఇప్పటికే ఇద్దరి నాయకుల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా.. విశేష ఆదరణ లభిస్తోంది. వారిద్దరి గెలుపు కూడా తథ్యమని ఇప్పటికే పలు సర్వేలు కూడా స్పష్టం చేశాయి. ఎందుకంటే.. ప్రస్తుతం చెన్నూరూతో పాటు బెల్లంపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో వివేక్, వినోద్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇద్దరు నాయకులకు ప్రజల నుంచి వస్తున్న భారీ రెస్సాన్స్ తో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్, బీజేపీ కలిసి రైడ్స్ చేయించాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ సమీపిస్తున్న వేళ.. కావాలని.. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గడ్డం వివేక్, వినోద్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి.. తట్టుకోలేక ఏ విధంగా ఢీకొట్టాలన్న ఆలోచనతో ఐటీ సోదాలు జరిపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఐటీ రైడ్స్ తో ఇద్దరు సోదరులను మానసికంగా ఇబ్బంది పెట్టొచ్చన్న ఆలోచనతోనే ఐటీ రైడ్స్ చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో చాలామంది రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తల ఇండ్లు, ఆఫీసులపై ఐటీ సోదాలు జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు, కొంతమంది ఇండ్లల్లో మాత్రం రోజుల తరబడి సోదాలు జరిగిన ఘటనలు మనం ఎన్నో చూశాం. ఇవాళ వివేక్, ఆయన సోదరుడు గడ్డం వినోద్ ఇండ్లు, ఆఫీసుల్లో ఉదయం ఆరు నుంచి తొమ్మిది లోపే సోదాలు ముగించారని తెలుస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది. అక్కడ ఏమీ లేదని, అన్ని సరిగ్గా ఉన్నాయని అధికారులు కూడా త్వరగా తనిఖీలను ముగించారని అంటున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్ గా ఐటీ సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఐటీ దాడులకు నిరసనగా బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు.