జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో ఐటీ సోదాలు

జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో ఐటీ సోదాలు
  •  రైల్వే లైన్​కు సేకరించిన భూముల రికార్డుల పరిశీలన
  •  రైతుల పరిహారం డబ్బుల్లో ట్యాక్స్ కన్సల్టెంట్ అక్రమాలు 
  • ఆరోపణలు రావడంతో అధికారుల తనిఖీలు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ లో గురువారం మధ్యాహ్నం ఐటీ ఆఫీసర్లు సోదాలు  నిర్వహిస్తున్నారు. రైల్వే లైన్ భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతుల వివరాలు , చెల్లించిన పరిహారం డబ్బుల రికార్డులను తనిఖీ చేస్తున్నారు. జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ప్రభుత్వం భూములను సేకరించింది. ఒక్కో ఎకరాకు రూ. లక్ష ఇస్తామని పేర్కొనడంతో రైతులు సరిపోవని, డబ్బులు వద్దంటూ బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఒక్కో ఎకరాకు రూ. పది లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు రైతుల   పక్షాన తీర్పు ఇచ్చింది.

కాగా.. పరిహారం చెల్లించడంలో లేట్ అయినందున డబ్బులను వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో భూ నిర్వాసితుల పేరిట సుమారు రూ. 3 కోట్ల వడ్డీ డబ్బులు వచ్చాయి. అయితే.. పాన్ కార్డు కలిగిన రైతులకు రూ. 2 కోట్లలో 10 శాతం ఆదాయపన్ను పోను మిగతా డబ్బులు అధికారులు చెల్లించారు. మరో రూ. కోటికి సంబంధించి రైతులకు పాన్ కార్డులు లేకపోవడంతో 20 శాతం ఆదాయ పన్ను చెల్లింపు చేశారు.

కాగా.. ఆదాయ పన్ను చెల్లించిన రైతులకు తిరిగి రాబట్టేందుకు జగిత్యాలకు చెందిన ట్యాక్స్ కన్సల్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడు. ఇతరుల పాన్ కార్డులతో క్లెయిమ్ చేసి డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. అనుమానించిన ఆదాయపు పన్ను డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు ఆర్డీవో ఆఫీస్ రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. కాగా అక్రమాలకు పాల్పడిన ట్యాక్స్ కన్సల్టెంట్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిసింది.