- కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో సీజ్ చేసిన నగదు లెక్కింపు పూర్తి
- 176 బస్తాల నోట్ల కౌంటింగ్‌కు 50 మంది సిబ్బంది.. 40 మిషన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో ఐటీ శాఖ పట్టుకున్న నగదు లెక్క ఆదివారం రాత్రి పూర్తయింది. మొత్తం సొమ్ము విలువ రూ.351 కోట్లని అధికారులు వెల్లడించారు. ఇలా ఒకే దాడిలో ఇంత పెద్ద మొత్తం దొరకడం దేశంలో ఇదే మొదటిసారని వివరించారు. ఐదు రోజుల పాటు సాగిన నోట్ల లెక్కింపు ఎట్టకేలకు ముగిసింది. ఎంపీ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న 176 బస్తాల నోట్ల కట్టలను మొత్తం 50 మంది సిబ్బంది 40 మెషిన్లతో లెక్కించారు. సోమవారం బ్యాంకులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి కౌంటింగ్ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నోట్ల కట్టల విలువ రూ.290 కోట్లు అని అంచనా వేయగా.. లెక్కింపు పూర్తయ్యాక ఈ మొత్తం రూ.351 కోట్లని తేలింది.
రాహుల్ మాట్లాడాలి: జేపీ నడ్డా
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసం, ఆఫీసుల్లో ఐటీ దాడుల్లో దొరికిన రూ.290 కోట్ల నోట్ల కట్టల గురించి రాహుల్ గాంధీ స్పందించాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ‘‘మిత్రమా, నోట్ల కట్టల గురించి మీరు, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఇది నయా భారతదేశం. రాజకుటుంబం పేరుతో దోపిడీ చేస్తామంటే ప్రజలు అనుమతించరు. మీరు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోవాల్సిందే కానీ.. చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు” అంటూ జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
మాకు సంబంధం లేదు: జైరామ్ రమేశ్
ధీరజ్ సాహూ వ్యాపారాలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలతో ఏ విధమైన సంబంధం లేదు’ అని చెప్పారు.
బీజేపీ నేతల జోలికి వెళ్లరా..
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలపై దాడులు నిర్వహిస్తే భారీ మొత్తంలో నగదు పట్టుబడుతుం దని కర్నాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. బీజేపీ నాయకులపై కూడా దాడులు చేయనివ్వండి. అప్పుడే వారి వద్ద ఎంత అవినీతి సంపద ఉందో బయటపడుతుంది’’ అని చెప్పారు.