- మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి కేఎల్ఆర్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు
- బడంగ్‌పేట్ మేయర్ పారిజాతారెడ్డి ఇంట్లో తనిఖీలు
- కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి బంధువు ఇంట్లోనూ రెయిడ్స్
- ఇయ్యాల కూడా కొనసాగే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకుల ఇండ్లపై ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) డిపార్ట్‌మెంట్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాతా నర్సింహారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది.
దాదాపు 32 మంది అధికారులతో కూడిన బృందాలు.. Baహైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 14 ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య తెల్లవారుజామున 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు చేశాయి. బ్యాంకు డాక్యుమెంట్స్, కంపెనీలు, సంస్థలకు చెందిన రికార్డులు, కంప్యూటర్స్ హార్డ్‌డిస్క్‌లను అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
ఆర్థిక లావాదేవీల డాక్యుమెంట్ల పరిశీలన
లక్ష్మారెడ్డి ఇల్లు, ఫామ్‌హౌస్, కేఎల్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. శంషాబాద్ బహదూర్‌గూడలోని కేఎల్‌ఆర్ ఇల్లు, తుక్కుగూడలోని పార్టీ ఆఫీస్, సికింద్రాబాద్‌లోని కేఎల్‌ఆర్ కార్పొరేట్ ఆఫీసులు, శంకర్‌పల్లి మండలం మాసానిగూడ, చేవెళ్ల మండలం తంగేడుపల్లి ఫామ్‌హౌస్‌లో సోదాలు జరిపారు. ఈ టైమ్‌లో కేఎల్ఆర్ సహా కుటుంబ సభ్యు లు, సిబ్బంది నుంచి ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేఎల్‌ఆర్ బ్యాంక్ అకౌంట్స్‌తో పాటు కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరి శీలించారు. నెల రోజుల ట్రాన్సాక్షన్స్ గురించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఐటీ సోదాలు జరుగుతున్న టైమ్‌లో కేఎల్ఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారమే దాడులు చేయిస్తున్నారన్నారు.
ఎక్కడున్నా ఇంటికి రావాలంటూ..
ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా.. నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. కూతురు, నర్సింహారెడ్డి తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీంతో ఐటీ అధికారులు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం అందించారు. ఎక్కడున్నా ఇంటికి రావాలని ఆదేశించారు. దీంతో నర్సింహారెడ్డి ఢిల్లీ నుంచి సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఆయనను ఐదుగురు సభ్యుల టీమ్ విచారించింది. బ్యాంక్ పాస్ బుక్స్, ఇంట్లో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. తర్వాత పారిజాతా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డిపై చాలా వ్యతిరేకత ఉంది. భూకబ్జాలు, అక్రమాలతో రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఓటమి భయంతోనే మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. వేల కోట్లు సంపాదించిన సబితా ఇంద్రారెడ్డిపై, బీఆర్‌ఎస్ నాయకులపై ఐటీ దాడు లు ఎందుకు జరుగడం లేదు?’’ అని ప్రశ్నించారు.
ALSO READ : అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు!
గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డికి సంబంధించి.. కోకాపేట- హిడెన్ గార్డెన్స్‌లోని నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు. గిరిధర్ రెడ్డి, కోమటిరెడ్డి భాగస్వాములుగా ఉన్న పలు కంపెనీల ఆఫీసుల్లో సోదాలు జరిపారు. బాలాపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ లీడర్ లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసేందుకు వెళ్లారు. లక్ష్మారెడ్డి అన్న కొడుకు ఐదు రోజుల కిందట మృతి చెందిన విషయం తెలిసి.. ఎలాంటి తనిఖీలు చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి లక్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడు. పారిజాత, నర్సింహా రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉండగా వీరు కలిసి పనిచేశారు.