
- మరో రెండు రోజుల పాటు సోదాలు కంటిన్యూ
హైదరాబాద్, వెలుగు: శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన సోదాలు.. మూడు రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32, రోడ్ నంబర్ 10లోని శ్రీచైతన్య సీఈవో, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. గత ఐదేండ్లలో ఆదాయం, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను గుర్తించారు. పన్ను ఎగవేతలకు సంబంధించిన సమాచారంతో శ్రీచైతన్య విద్యా సంస్థలపై సోమవారం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కార్పొరేట్ ఆఫీస్ సహా డైరెక్టర్ యలమంచిలి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఖమ్మం టౌన్‌లోని ఎన్‌టీఆర్ సర్కిల్ శ్రీచైతన్య కాలేజీలోనూ సోదాలు నిర్వహించారు. దీనితో పాటు ఏపీ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ప్రాంతీయ కార్యాలయాల్లో తనిఖీలు చేసి హార్డ్ డిస్కులు, ఫీజులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల్లో ఇప్పటికే భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మరో రెండు రోజులు కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ అనంతరం సంబంధిత సిబ్బందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేయనుంది.