శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు.. లక్షల్లో ఫీజులు గుంజుతూ.. 230 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన శ్రీచైతన్య

శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు.. లక్షల్లో ఫీజులు గుంజుతూ.. 230 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన శ్రీచైతన్య

హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు జరిగినట్లు ఐటీ శాఖ తేల్చింది. 230 కోట్ల రూపాయల మేరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు ఐటీ శాఖ గుర్తించింది. ఐదు రోజులపాటు శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ శాఖ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఈ కార్పొరేట్ కాలేజ్ అక్రమాలు బయటపడ్డాయి. శ్రీ చైతన్య కాలేజీ సోదాల్లో ఐదు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంలో 230 కోట్లతో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఐటీ సోదాల్లో తేలింది.

విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుకు రెండు సాఫ్టేవేర్లను, ట్యాక్స్ చెల్లించేందుకు ఒక సాఫ్టేవేర్ను, ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకై మరొక సాఫ్ట్వేర్ను శ్రీ చైతన్య కాలేజ్ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ సోదాల్లో బయటపడింది. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయల ఆస్తులను శ్రీచైతన్య కళాశాలల యాజమాన్యం కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది.

కార్పొరేట్‌ కాలేజీలు ఏటేటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నాయి. సంవత్సరానికి రూ.30 వేల నుంచి రూ.60 వేల దాకా పెంచుతున్నాయి. ఈ కాలేజీల్లో కేవలం ఇంటర్మీడియెట్‌ కోర్సులు చేసేందుకు వీలుండదు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీలతోపాటు నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర కాంబినేషన్లను చచ్చినట్టు తీసుకోవాల్సిందే. అప్పుడే సీటు దొరుకుతుంది. ఐకాన్‍, నియాన్‍, మెడికాన్‍, లియో లాంగ్‍, కో–స్పార్క్, స్పార్క్, ఐసీ, జెడ్‍–ఎఫ్‍టీబీ, ఎన్‍జెడ్‍, ఎల్‍టీసీ.. ఇలా రకరకాల ప్రోగ్రామ్‍లతో ఫీజులు వసూలు చేస్తున్నాయి.

ALSO READ | కోకాపేటలో ఐటీ ఆఫీసులు ఉన్న.. GAR బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్

ఎంసెట్, ఏఐఈఈఈ–మెయిన్స్, ఐఐటీ–అడ్వాన్స్‌డ్‍, సీఏ–సీపీటీ, బిట్‍శాట్‍, ఏఎఫ్‍ఎంసీ, బీహెచ్‍యూ, జిప్‍మెర్‍, నిట్స్ వంటి ఎంట్రన్స్ టెస్ట్‌లకు స్పెషల్‌ ట్రెయినింగులు ఇస్తున్నాయి. స్టూడెంట్స్ ఎంచుకున్న కోర్సు, క్యాంపస్‌లను బట్టి ఈ ఫీజులు మారిపోతుంటాయి. రెసిడెన్షియల్ క్యాంపస్‍ల్లో ఒక్కో స్టూడెంట్‌‌కు 2 లక్షల నుంచి 4 లక్షలు.. ఏసీ హాస్టల్‌‌ పేరిట మరో 50 వేలు.. డే స్కాలర్‌‌కు లక్ష నుంచి లక్షన్నర.. సెమీ రెసిడెన్షియల్‌‌ అయితే 2 లక్షలు. ఇంటర్‌‌ చదువుకు కార్పొరేట్‌‌ కాలేజీలు గుంజుతున్న ఫీజులివీ.

రాష్ట్రంలో ఇంటర్ విద్య అంటే శ్రీచైతన్య కాలేజీ మాత్రమే అనే స్థాయిలో చేస్తున్న హడావుడికి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. వీటికి మరికొన్ని ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు జత కలిసి ఇంటర్ అంటే ఎంపీసీ, బైపీసీ మాత్రమే అనే స్థాయికి పరిస్థితిని తెచ్చాయంటే ఈ కార్పొరేట్ మేనేజ్మెంట్లు ఎంతగా వేళ్లూనుకుపోయాయో అర్థమవుతుంది.