హైదరాబాద్‌లో కుండపోత : గంటపాటు దంచికొట్టిన వాన

హైదరాబాద్‌లో కుండపోత : గంటపాటు దంచికొట్టిన వాన

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. శనివారం రాత్రి 7:30 గంటల నుంచి గంటపాటు దంచికొట్టింది. దీంతో సిటీలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో అత్యధికంగా గోల్కొండలో 9.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్​లో 8.6, ఆసిఫ్​నగర్​లో 8, మెహిదీపట్నంలో 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి,  మహబూబ్​నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జి ల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో అత్యధికంగా 10.3 సెంటీమీటర్లు, సంగారెడ్డిలోని దిగ్వాల్​లో 9.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 

పలు జిల్లాలకు అలర్ట్.. 

నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్​జారీ చేసింది. సోమవారం ఉమ్మడి ఖమ్మం,  నల్గొండ, సూర్యాపేట, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని చెప్పింది.