
- కాంస్య పతకం గెలిచిన షూటర్ స్వప్నిల్
- 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ పోటీలో మెడల్ తెచ్చిన తొలి ఇండియన్‌గా ఘనత
- పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు మూడో పతకం
పారిస్ : ఒకటి .. రెండు.. మూడు.! పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల ఖాతా మొదలైన షూటింగ్ నుంచే ఇండియాకు మూడో మెడల్ లభించింది. ఇండియా షూటర్ స్వప్నిల్ కుశాలె మెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో కాంస్య పతకం అందుకున్నాడు. గురువారం ఎనిమిది మందితో కూడిన షూటర్లతో జరిగిన ఫైనల్లో కుశాలె మొత్తంగా 451.4 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ ఖాతాలో వేసుకున్నాడు.
చైనా షూటర్ యుకున్ లియు (463.6) గోల్డ్, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హియ్ కులిష్ (461.3) సిల్వర్ మెడల్స్ గెలిచారు. ఫైనల్‌కు ముందు ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో బరిలోకి దిగిన కుశాలె.. ఓ దశలో ఆరో స్థానానికి పడిపోయాడు. కానీ, విజయ ఆకలితో అద్భుతంగా పుంజుకున్నాడు. ఒత్తిడిలో హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతున్నా గురి మాత్రం తప్పకుండా పోడియంపైకి వచ్చాడు. ఒలింపిక్స్ చరిత్రలో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో ఇండియాకు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం.
తడబడి.. తేరుకొని
ఎనిమిది మంది మేటి షూటర్లు పోటీ పడ్డ ఫైనల్లో కుశాల్ అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. తొలుత తడబడినా.. చివర్లో పట్టు వదలకుండా పోరాడాడు. మొదటిదైన మోకాళ్లపై కూర్చొని షూట్ చేసే నీలింగ్ లో కుశాలె తొలి షాట్‌కు 9.6 పాయింట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆ తర్వాత అతను పుంజుకున్నాడు. 10.5, 10.3 షాట్లతో ఆకట్టుకున్నాడు.
ఓ దశలో రెండో ప్లేస్‌కు వచ్చినా మొత్తంగా మూడు సిరీస్‌ల నీలింగ్‌లో 15 షాట్ల తర్వాత 153.3 స్కోరుతో ఆరో స్థానంలో నిలిచాడు. బోర్లా పడుకొని కాల్చే ప్రోన్ పొజిషన్‌లో స్వప్నిల్ ఆకట్టుకున్నాడు. ఈ పొజిషన్‌లో చేసిన 15 షాట్స్‌లో అన్నింటిలో 10 కంటే ఎక్కువ స్కోర్లు సాధించాడు. దాంతో మూడు సిరీస్‌ల ప్రోన్ దశ ముగిసే సమయానికి మొత్తం 310.1 స్కోరుతో ఐదో స్థానంలోకి వచ్చాడు. ఇక స్టాండింగ్ పొజిషన్‌లో ఇండియా షూటర్ జోరు పెంచాడు.
ఇందులో రెండు సిరీస్‌లు పూర్తయి ఎలిమినేషన్ సిరీస్ మొదలయ్యే సరికి 411.6 స్కోరుతో మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఒత్తిడిని తట్టుకున్నాడు. ఎలిమినేషన్ మొదలైన తర్వాత వరుసగా 10.5, 9.4, 9.9 స్కోర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో అంజుమ్ మౌద్గిల్, సిఫ్ట్ కౌర్ సమ్రా ఫైనల్ కూడా చేరలేకపోయారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అంజుమ్ 18, సిఫ్ట్ 31వ స్థానంతో సరిపెట్టి ఇంటిదారి పట్టారు.
రూ. కోటి నజరానా
ఒలింపిక్ మెడల్ నెగ్గిన స్వప్నిల్ కుశాలెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అతనికి కోటి రూపాయల నజరానా
ప్రకటించారు.
స్కోరు బోర్డును కూడా చూడలేదు
ఫైనల్‌కు ముందు నేనేమీ తినలేదు. కేవలం బ్లాక్ టీ తాగి వచ్చాను. దాంతో ఆకలితో నా కడుపులో రైళ్లు పరుగెత్తాయి. ప్రతి మ్యాచ్ ముందు రోజు రాత్రి నేను దేవుడిని ప్రార్థిస్తాను. ఫైనల్లో నా గుండె వేగంగా కొట్టుకుంది. దాంతో నా శ్వాసను నియంత్రించుకోవడానికి ప్రయత్నించా. అంతే తప్ప భిన్నంగా ఏమీ చేయలేదు. ఎన్నో ఏండ్ల శ్రమ ఫలితంగా నేను ఇక్కడిదాకా వచ్చాను.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టార్గెట్‌పై తప్ప మరే దానిపై ఫోకస్ పెట్టలేదు. నిజం చెప్పాలంటే ఫైనల్లో కనీసం స్కోర్ బోర్డ్‌ను చూడలేదు. నేను మానసికంగా అంత స్ట్రాంగ్ కాదు. ఈ విషయంలో నా కోచ్‌లు, సహాయక సిబ్బంది అంతా నాకు అండగా నిలిచారు. నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ విజయంలో నా వ్యక్తిగత కోచ్ దీపాలి దేశ్‌పాండేది కీలక పాత్ర. తను నాకు మరో తల్లి లాంటిది. మా అమ్మతో నేనింకా మాట్లాడలేదు. – స్వప్నిల్ కుశాలె