కరీంనగర్, వెలుగు: కరీంనగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓటు షేర్ 2014, 2018 ఎన్నికలతోపాటు ఈ ఎన్నికలోనూ పెద్దగా మారలేదు. త్రిముఖ పోటీ కారణంగా 40 శాతం ఓట్లతో వరుస విజయాలు అందుకున్నారు. 2014లో పోలైన 1,88,673 ఓట్లలో ఆయనకు 40.92 శాతం(77,209) ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పోలైన 1,98,926 ఓట్లలో 40.71 శాతం (80,983) ఓట్లు గంగుల ఖాతాలోపడ్డాయి. ఈ సారి 2,29,774 ఓట్లు పోలవ్వగా ఆయనకు 40.12 శాతం(92,179) ఓట్లు రావడం గమనార్హం.
సంజయ్ కి పెరిగిన ఓట్ షేర్
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి ఒక్కో ఎన్నికకు 5 శాతం ఓటు షేర్ పెరుగుతుండడం విశేషం. 2014 ఎన్నికతో పోలిస్తే 2023 ఎన్నికల్లో ఏకంగా 11 శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా పోటీ చేసినప్పుడు 27.80 శాతం(52,455) ఓట్లు రాగా, 2018లో ఇదే స్థానం నుంచి పోటీచేస్తే 33.18 శాతం(66,009) ఓట్లు వచ్చాయి. ఈ సారి 38.74 శాతం(89,016) ఓట్లు వచ్చాయి. కేవలం 3,163 ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతిలో మూడోసారి ఓడిపోయారు.
చొప్పదండిలో వన్ టైం ఎమ్మెల్యే సెంటిమెంట్ రిపీట్
చొప్పదండి వన్ టైం ఎమ్మెల్యే సెంటిమెంట్ మరోసారి రిపీటైంది. 2009లో చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ గా మారిన తర్వాత ఇక్కడి నుంచి గెలిచినవాళ్లు రెండోసారి గెలవడం లేదు. 2009లో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య టీడీపీ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో మళ్లీ ఆయన పోటీ చేసినప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బొడిగె శోభ గాలన్న చేతిలో ఓడిపోయారు.
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ బొడిగె శోభకు ఇవ్వకుండా సుంకె రవిశంకర్ కు అధిష్టానం కేటాయించింది. దీంతో ఆమె బీజేపీ నుంచి పోటీ చేసినప్పటికీ సుంకె రవిశంకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. రవిశంకర్ మరోసారి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం చేతిలో ఓడిపోయారు. దీంతో వన్ టైం ఎమ్మెల్యే సెంటిమెంట్ మరోసారి నిజమైంది.