- 2025 చాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ ప్రకటన
దుబాయ్: పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న 2025 చాంపియన్స్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత వరల్డ్ కప్ లీగ్ దశలో టాప్–7లో నిలిచిన టీమ్స్ మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తాయని ఆదివారం వెల్లడించింది. ఆతిథ్య పాకిస్తాన్ జట్టు హోదాలో పాక్ ఆటోమేటిక్‌గా క్వాలిఫై అయింది. చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయని గతంలోనే ఇంటర్నేషనల్ బాడీ ప్రకటించింది.
ఒకవేళ ఈ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ టాప్7లో నిలిస్తే ఎనిమిదో జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో వరల్డ్ కప్‌కు అర్హత సాధించని ఐసీసీ సభ్యదేశాలు వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్‌ల పరిస్థితిపై గందరగోళం నెలకొంది. అలాగే ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఎంట్రీపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఐసీసీ ప్రకటనపై విండీస్, జింబాబ్వే, ఐర్లాండ్ బోర్డులు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
1998లో మొదలైన చాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదిసార్లు జరిగింది. చివరగా 2017లో జరిగిన టోర్నీలో ఇండియాను ఓడించిన పాక్ టైటిల్ గెలిచింది. మరోవైపు ఈ ట్రోఫీ కోసం ఇండియా.. పాక్‌కు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు.