రెండో రోజూ కొన‌సాగుతున్న ఐటీ సోదాలు

రెండో రోజూ కొన‌సాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బుధ‌వారం (22 జ‌న‌వ‌రి 2025) ఎస్‌వీసీ, మైత్రీ , మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇటీవ‌ల విడుద‌లైన సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తున్నారు అధికారులు.

పుష్ప-2 సినిమాకు సంబంధించిన‌ బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై అధికారుల ఆరా తీశారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు నిర్వ‌హిస్తున్నారు అధికారులు.

నిర్మాత దిల్ రాజు ఇంట్లో మంగ‌ళ‌వారం (21 జ‌న‌వ‌రి) సోదాలు చేసిన అధికారులు.. రెండో రోజు కూడా సోదాలు కొన‌సాగిస్తున్నారు. నిన్న (మంగ‌ళ‌వారం) దిల్‌ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు.. ఈరోజు (బుధ‌వారం) మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్‌ రాజును తీసుకెళ్లే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఐటీ అధికారులు మంగళవారం (21 జనవరి) ఉదయం నుంచి తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మూవీ మేకర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐటీ అధికారులు 55 బృందాలుగా 8 చోట్ల ఒకేసారి సోదాలు చేస్తున్నారు.  గచ్చిబౌలి,హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.