
- మళ్లీ గెలిపిస్తే.. 25 వేలు ఆదా
- కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట ఆప్ మేనిఫెస్టో
- యువతకు ఉద్యోగాలు కల్పించడమే ఫస్ట్ హామీ
- ఢిల్లీకి వచ్చే నీళ్లలో హర్యానా విషం కలుపుతోందని ఫైర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో తమను మళ్లీ గెలిపిస్తే యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేషనల్ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. మహిళా సమ్మాన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2,100 ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. సోమవారం ఆయన ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో " కేజ్రీవాల్ కి గ్యారంటీ" పేరిట పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అందులో మొత్తం 15 గ్యారంటీలున్నాయి.
యువత, మహిళలు, వృద్ధులు, పూజారులు, డ్రైవర్ల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఆప్ ఈ హామీలిచ్చింది. ఇచ్చిన హామీలన్నింటిని ఐదేండ్లల్లో అమలు చేస్తామని తెలిపింది. అధికార పార్టీకి మళ్లీ ఓటు వేస్తే నెలకు రూ.25,000 ఆదా అవుతాయని పేర్కొంది.
ఆప్ గ్యారంటీలు ఇవే..
యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు కొత్త జాబ్ లను క్రియేట్ చేస్తామని ఆప్ తన మేనిఫెస్టోలో మొదటి హామీగా పేర్కొంది. మహిళా సమ్మాన్ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2,100 అందిస్తామని వెల్లడించింది.
సంజీవని యోజన స్కీమ్ కింద 60 ఏండ్లు దాటినవారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, నీటి బిల్లుల మాఫీ.. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ఢిల్లీ రోడ్లను మరింత మెరుగుపరుస్తామని ఆప్ తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లు, ఢిల్లీలో స్టూడెంట్లకు ఉచిత బస్సు ప్రయాణం మెట్రో ఛార్జీలలో 50% తగ్గింపు ప్రయోజనం కల్పిస్తామని చెప్పింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని.. వారి కూతుర్ల పెండ్లిళ్లకు రూ.లక్ష ఇవ్వడంతో పాటు డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా కవరేజీ కల్పిస్తామని వివరించింది.
ఆప్ హామీలను బీజేపీ కాపీ చేస్తోంది
మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ హామీలను బీజేపీ కాపీ కొడుతున్నదని ఆరోపించారు. అయితే, హామీలు ఇచ్చే విషయంలోనే తప్ప వాటిని నెరవేర్చే విషయంలో ఆప్సర్కారును కాపీ కొట్టడంలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీని గెలిపించలేదనే ఆక్రోశంతో ఢిల్లీ వాసులకు వచ్చే తాగునీటిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఢిల్లీ ప్రజలను చంపడమేంటని ప్రశ్నించారు. అధికారం కోసం మరింత దిగజారిపోవద్దని బీజేపీకి సూచించారు.
ఆయితే, ఈ ఆరోపణలను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆయనో అబద్ధాల ఫ్యాక్టరీ అని ఫైర్ అయింది. జర్నలిస్టులు, విశ్లేషకులను తీసుకెళ్లి నీటి నాణ్యతను చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.