శ్రీచైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజూ ఐటీ సోదాలు

శ్రీచైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజూ ఐటీ సోదాలు
  •  
  • హైదరాబాద్, ఖమ్మంలో డైరెక్టర్ల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
  • హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, ఆడిట్‌‌‌‌ రికార్డులు స్వాధీనం
  • నేడు, రేపు కొనసాగనున్న సోదాలు!

హైదరాబాద్‌‌‌‌/ఖమ్మం, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. హైదరాబాద్, ఖమ్మంలోని డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్‌‌‌‌  అయ్యప్ప సొసైటీలోని కార్పొరేట్  ఆఫీసు సహా డైరెక్టర్  యలమంచిలి శ్రీధర్  విల్లాలోనూ సోదాలు నిర్వహించారు. సోదాల్లో పలు కీలక పత్రాలు, ఆడిట్  రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, ఖమ్మంలోని శ్రీచైతన్య డైరెక్టర్  మల్లెంపాటి శ్రీధర్, జనరల్  మేనేజర్​ నాగేందర్  ఇండ్లు, ఎన్టీఆర్​ సర్కిల్  సమీపంలో ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల హెడ్డాఫీసులో కూడా అధికారులు తనిఖీలు చేసి పలు ఫైల్స్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఖమ్మం నగరంలో శ్రీచైతన్యకు 13 బ్రాంచీలు ఉన్నాయి.

ప్రైమరీ స్కూళ్ల నుంచి ఇంటర్​ కాలేజీలు ఉండగా, మూడేళ్ల క్రితం కిట్స్​ ఇంజినీరింగ్  కాలేజీని కొనుగోలు చేసి శ్రీచైతన్య ఇంజినీరింగ్  అండ్​ టెక్నాలజీ కాలేజీగా మార్చారు. రెండేళ్ల క్రితం ఖమ్మంలో గ్లోబల్  విస్టా పేరుతో ఇంటర్నేషనల్  స్కూల్ ను కూడా ప్రారంభించారు. ఇంటర్  కాలేజీలకు సంబంధించి సౌధ బిల్డింగ్ లో హెడ్ ఆఫీస్​ ఉండగా, స్కూళ్లకు సంబంధించి మమత కాలేజీ సమీపంలోని ఒలింపియాడ్  స్కూల్ ను మెయిన్​ బ్రాంచీగా నడుపుతున్నారు.

గతంలో సొంతంగా శ్రీచైతన్య పేరుతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన మల్లెంపాటి శ్రీధర్.. కొన్నేళ్ల క్రితం శ్రీచైతన్య గ్రూపులో వాటిని విలీనం చేశారు. ఐటీ చెల్లింపుల్లో అవకతవకల కారణంగా సోమవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి.