దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. ఆడిట్ రిపోర్టులు, బ్యాలెన్స్ షీట్స్ స్వాధీనం..

దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. ఆడిట్ రిపోర్టులు, బ్యాలెన్స్ షీట్స్ స్వాధీనం..
  • 4 రోజుల పాటు కొనసాగిన సెర్చింగ్
  • స్టేట్​మెంట్ రికార్డ్
  • ఎస్​వీ క్రియేషన్స్ ఆఫీస్​కు తీసుకెళ్లి తనిఖీలు
  • ఆడిట్ రిపోర్టులు, బ్యాలెన్స్ షీట్స్ స్వాధీనం.. స్టేట్​మెంట్ రికార్డ్

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ఫిలిం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ (ఎఫ్‌‌డీసీ) చైర్మన్‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌ దిల్‌‌రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఐదు రోజుల సెర్చ్ వారెంట్​తో మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు.. శుక్రవారం మధ్యాహ్నంతో ముగిశాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఢాకు మహారాజ్ సహా భారీ బడ్జెట్ సినిమాల ఆదాయం, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌‌, మ్యాంగో మీడియా, దిల్‌‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. పుష్ప2 డైరెక్టర్‌‌‌‌ సుకుమార్‌‌‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌ నెక్కంటి శ్రీధర్ ఇండ్లల్లోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి. కాగా, నిర్మాత దిల్‌‌రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. విచారణలో భాగంగా దిల్‌‌రాజును శ్రీనగర్‌‌‌‌ కాలనీలోని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌‌కు తీసుకెళ్లారు. 

ఆయన సమక్షంలోనే పలు డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గేమ్‌‌ఛేంజర్‌‌‌‌, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. ఢాకు మాహారాజ్‌‌ సినిమాకు దిల్‌‌రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఉండడంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన డబ్బులు, వచ్చిన లాభాలు వంటి అనేక అంశాలపై ఐటీ అధికారులు దిల్‌‌రాజుతో పాటు ఎస్‌‌వీసీ ఆడిటర్‌‌‌‌, అకౌంటెంట్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌ను రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం.