- కూకట్‌పల్లి సహా హైదరాబాద్‌లోని 8 ప్రాంతాల్లో సోదాలు
- ఓ చానల్ ఎండీ ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు
- లావాదేవీలపై అధికారుల ఆరా
హైదరాబాద్, వెలుగు: పలు ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఇన్‌కం ట్యాక్స్(ఐటీ) నజర్ పెట్టింది. ఓ న్యూస్ చానల్ ఎండీ ఇల్లు, ఆఫీసులుసహా హైదరాబాద్‌లోని 8 ప్రాంతాల్లో మంగళవారం ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కూకట్‌పల్లి రెయిన్బో విస్టాలోని బొల్లా రామకృష్ణ ఇంట్లో తెల్లవారుజామున 6 గంటల నుంచే సోదాలు ప్రారంభించారు. రామకృష్ణకు చెందిన స్టార్ ఫైనాన్స్, న్యూస్ చానల్ ఆఫీస్ సహా హాస్పిటల్, రియల్ ఎస్టేట్ ఆఫీసులలో తనిఖీలు చేశారు. దాదాపు 50 మంది అధికారులు 8 టీమ్స్‌గా విడిపోయి సోదాలు నిర్వహించారు.
బషీర్‌బాగ్‌లోని పైగా ప్లాజాలోని ఓ ఫైనాన్స్ ఆఫీస్‌తో పాటు కూకట్‌పల్లి, మూసాపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లోని పలు కార్యాలయాల్లో సోదాలు జరిపారు. ఈ కంపెనీలకు చెందిన ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీశారు. ఐదేండ్లుగా ఐటీ చెల్లింపులకు సంబంధించిన ఆడిట్ రిపోర్ట్‌లను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలకు చెందిన డాక్యుమెంట్లను అందించాలని ఆదేశించారు. సోదాలకు సంబంధించిన వివరాలను మాత్రం ఐటీ అధికారులు ప్రకటించలేదు. తనిఖీలు బుధవారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి.