ఆయనొక గొప్ప సంగీత విద్వాంసుడు, అయితేనేం, ఆయనకు విపరీతమైన ఆడ పిచ్చి.
ఆయనొక గొప్ప మహాకవి. అయితేనేం, ఆయన వ్యసనాలకు బానిస.
ఆయనొక గొప్ప ప్రవచనకారుడు. అయితేనేం... నిత్యాగ్నిహోత్రం. సిగరెట్లు పెట్టెలకు పెట్టెలు కాలుస్తాడు...
ఒక గొప్ప వ్యక్తిలో నుంచి మంచిని గ్రహించకుండా, వాళ్లలోని దోషాలను ఎత్తి చూపటం సర్వసాధారణంగా కనిపిస్తుంది.
ఇది మానవ నైజం.
ఎదుటి మనిషిలో ఏం దోషాలున్నాయా? అని రంధ్రాన్వేషణ చేయటం, అవతలి వ్యక్తిలోని ఔన్నత్యాన్ని, ప్రతిభను చూసి ఈర్ష్యపడి, తమ అక్కసును ఇలా వెళ్లబుచ్చటం మానవుల దుర్లక్షణం.
‘‘నువ్వు ఏ తప్పూ చేయనప్పుడు.. నీలో ఏ దోషమూ లేనప్పుడు.. నీకు ఏ వ్యసనమూ లేనప్పుడు.. నీలో అసలు ఏ అవలక్షణమూ లేనప్పుడు మాత్రమే అవతలి వ్యక్తిలోని లోపాలను ఎత్తి చూపు’’ అని అన్ని మతాలు చెప్తున్నాయి.
అలాగే ఒక వేలు ఎదుటివారి వైపు ఉంచినప్పుడు నాలుగు వేళ్లు మన వైపు ఉంటాయని గుర్తించాలని దశాబ్దాలుగా పండితులు చెప్తూనే ఉన్నారు. కానీ, మనిషిలో ఉండే అసూయ అనే గుణం, అవతలి వ్యక్తి ఉన్నత స్థితిలోకి వెళ్తుంటే... వాళ్లలోని దోషాలను ఎత్తి చూపుతూ ఆత్మానందం పొందుతుంటారు. ఇందువల్ల ఏ మాత్రం లాభం ఉండదు.
ఒక వ్యక్తిలోని మంచిని మాత్రమే గ్రహించి, ఆ గుణాలను ప్రస్తావించుకుంటూ, ఆత్మ విమర్శ చేసుకుంటే, మనిషి తన జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతాడు.
రామరావణ యుద్ధం అప్పుడు ఇరువురూ ఒకరికి ఒకరు ఎదురుపడిన సమయంలో, రావణుడితో యుద్ధం చేసే సమయంలో, ‘‘ఆహా ఏమి రూపం, ఏమి తేజస్సు. పరదారాపహరణం అనే ఒక్క అవలక్షణం లేకపోతే, రావణుడిని మించినవాడు లేడు కదా..’’ అనుకున్నాడు రాముడు. అదీ మహానుభావుల లక్షణం.
రావణుడిలోని సద్గుణాలను స్తుతించాడు. జానకిని అపహరించినందుకు సంహరించాడు. అవతలి వ్యక్తిలోని సద్గుణాలను స్తుతించాలి. వాటిని ప్రశంసించాలి. లోపాలను, తప్పులను ఎత్తి చూపే పని, వాటికి శిక్ష వేసే పని సృష్టికర్తదని, సామాన్య మానవులది కాదని గ్రహించాలి.
తనకు లేని తెలివితేటలు, తనకు లేని జ్ఞానం, తనకు లేని పేరుప్రతిష్ఠలు... అవతలివారికి ఉంటే చూసి ఆనందపడలేకపోవటం మానవుల సహజ లక్షణం. కామ క్రోధ లోభ మదమోహమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించమని వేద కాలం నుంచి మహర్షులు బోధిస్తూనే ఉన్నారు. ‘‘తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు’’ అని వేమన చెప్తున్నాడు. మనిషిలో గుణదోషాలుంటాయి, కేవలం గుణాలను మాత్రమే చూడటం నేర్చుకో అని భగవద్గీత చెబుతోంది.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం...
ఒక విద్వాంసుడి దగ్గరకు ఒక సాధారణ వ్యక్తి వచ్చి, ఆయనతో పిచ్చాపాటిగా కాలక్షేపం కబుర్లు చెప్తున్నాడు. మధ్యలో ఆ సాధారణ వ్యక్తి, ‘‘అయ్యా, మీరు పండితులు కదా, ఫలానా కవి గారి గురించి మీరు అంత గొప్పగా ఎందుకు చెప్తారు. ఆయన సర్వ వ్యసనాలకు బానిస కదా’’ అంటూ ఇంకా ఏవేవో దూషణగా మాట్లాడుతున్నాడు. మధ్యలోనే మాటలకు అడ్డుపడుతూ ఆ విద్వాంసుడు, ‘‘నాయనా! నువ్వు ఆ మహాకవిని వ్యసనపరుడు అంటున్నావు కదా.. నువ్వు కూడా ఆ వ్యసనాలు అలవాటు చేసుకోగలవు. కానీ, ఆయనలాగ నాలుగు వాక్యాలు రాయగలవా? ఒక్కసారి ఆలోచించు. ఆయనలో మాత్రమే ఉన్న ప్రతిభ గురించి మాట్లాడాలే కానీ, ఆయనలోని తప్పులు ఎంచుతూ కూర్చుంటే ఈ ప్రపంచంలో మనకు మంచివారే కనపడరు. అంతేకాదు, అలా మాట్లాడుకోవటం వల్ల మనకు ఎటువంటి లాభం ఉంటుంది చెప్పు’’ అని కొంచెం ఘాటుగానే అడిగాడు ఆ విద్వాంసుడు. ఆ సాధారణ వ్యక్తి మౌనం వహించాడు.
ఇదీ మనం నేర్చుకోవలసింది.
భగవంతుడి సృష్టిలో తప్పులు చేయని ప్రాణి లేదు. కాని, ప్రతిభ గల వారు కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి వారి ప్రతిభను ప్రశంసించాలే కానీ, తప్పుల గురించి మాత్రమే చర్చించుకుంటూ, కాలక్షేపం చేయటం వలన ఆ మహాకవుల వంటి వారికి జరిగే నష్టం ఏమీ ఉండదు. ఏనుగు నడుస్తుంటే బోలెడు కుక్కలు మొరుగుతాయి. దేనినీ పట్టించుకోకుండా, ఏనుగు ముందుకు నడుస్తూనే ఉంటుందని అర్థం చేసుకోవాలి.
- డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232