మంచిర్యాల - అంతర్గాం బ్రిడ్జికి బ్రేక్..ఆల్టర్నేట్​గా ముల్కల్ల దగ్గర నిర్మాణానికి ప్లాన్

  • –   అక్కడే ఎన్​హెచ్63 బైపాస్​తో అనుసంధానం
  •     ప్రస్తుతానికి ప్రాథమిక చర్చల దశలోనే..
  •     మంచిర్యాల వద్ద నిర్మిస్తే టౌన్​లో ట్రాఫిక్ తిప్పలే

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–అంతర్గాం నడుమ గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్కల్ల శివారులో నిర్మించాలనే ప్రపోజల్స్ తెరపైకి వచ్చినట్టు సమాచారం. మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి కంటే మెరుగైన ఈ కొత్త ప్రతిపాదనను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు అధికారుల ముందు పెట్టినట్టు తెలిసింది.”

ప్రస్తుతం ప్రాథమిక చర్చల దశలో ఉన్న ప్రపోజల్​ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారని, త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తే మంచిర్యాల, పెద్దపల్లి మధ్య సుమారు 20 కిలోమీటర్ల  దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీరాంపూర్, గోదావరిఖని, రామగుండం ఎక్స్​ రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఈ బ్రిడ్జి పూర్తయితే మంచిర్యాల నుంచి నేరుగా రామగుండం, బసంత్​నగర్ చేరుకోవచ్చు. తద్వారా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లేవారికి దూరభారం తగ్గుతుంది. 

రూ.164 కోట్లతో టెండర్

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ మంచిర్యాల–అంతర్గాం నడుమ గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. రూ.125 కోట్ల బడ్జెట్​ను సాంక్షన్ చేస్తున్నట్టు శ్రీరాంపూర్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ఎన్నికల తర్వాత బ్రిడ్జి నిర్మాణం మరుగున పడగా, మళ్లీ 2023 ఎన్నికల ముందు కదలిక వచ్చింది. అప్పటికే నాలుగేండ్లు జాప్యం కావడంతో అంచనా వ్యయాన్ని రూ.164 కోట్లకు పెంచి నిరుడు టెండర్లు పిలిచారు. వల్లభనేని కన్​స్ట్రక్షన్స్ టెండర్ దక్కించుకుంది.

జూన్ 9న ఐడీఓసీ ఓపెనింగ్ చేసిన కేసీఆర్ అక్కడి నుంచే వర్చువల్​గా బ్రిడ్జి పనులను ప్రారంభించారు. అనంతరం సాయిల్ టెస్టింగ్ కోసం గోదావరి ఒడ్డున గౌతమేశ్వర టెంపుల్ దగ్గర కాంట్రాక్టర్ గుంతలు తీసి వదిలేశాడు. సదరు కంపెనీకి భారీగా బిల్లులు బకాయి పడడంతో ఈ పనులపై ఇంట్రెస్ట్ చూపలేదని తెలిసింది. ఈలోగా వానలు కురిసి గోదావరికి వరదలు రావడం వల్ల పనులు ముందుకు సాగలేదు. 

ముల్కల్ల దగ్గర నిర్మించడమే బెటర్

ప్రస్తుతం మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జిని మంచిర్యాల గోదావరి ఒడ్డున గౌతమేశ్వర టెంపుల్ దగ్గర నిర్మిస్తున్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. చంద్రాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి వైపు నుంచి వచ్చే వెహికల్స్ మంచిర్యాల టౌన్ నుంచి కాలేజ్ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్​లో హెవీ వెహికల్స్ వెళ్లడానికి చాన్స్ లేదు.

పైగా ఓవర్ బ్రిడ్జి కింద నుంచి కాలేజ్ రోడ్​ వైపు వెళ్లడం ఇబ్బందవుతుంది. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల్లో ఇది కూడా ఒకటని విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్కల్ల శివారులో నిర్మించడమే బెటర్ అంటున్నారు. ఎందుకంటే... నిజామాబాద్–జగదల్పూర్ ఎన్​హెచ్ 63లో భాగంగా ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు బైపాస్ నిర్మించి మంచిర్యాల–చంద్రాపూర్ ఎన్​హెచ్363తో అనుసంధానం చేస్తున్నారు.

దీంతో గోదావరిపై ముల్కల్ల శివారులో బ్రిడ్జి నిర్మించి దానిని ముల్కల్ల–కుర్మపల్లి బైపాస్​తో లింక్ చేయాలి. తద్వారా చంద్రాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి వైపు నుంచి వచ్చే వెహికల్స్ మంచిర్యాలలోకి రాకుండా బైపాస్ మీదుగా గోదావరి బ్రిడ్జి పైనుంచి పెద్దపల్లి జిల్లాలోకి ఎంటరయ్యే అవకాశం ఉంటుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్, హైదరాబాద్ వెళ్లేవారు కూడా ఇదే మార్గంలో ప్రయాణించవచ్చు. దీంతో మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాకుండా హెవీ వెహికల్స్ నేరుగా వెళ్లడానికి వీలుంటుంది.

ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే..

గోదావరిపై ముల్కల్ల దగ్గర బ్రిడ్జి నిర్మాణం గురించి చర్చ వచ్చినమాట వాస్తవం. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి వర్క్ ఆల్రెడీ గౌతమేశ్వర టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యింది. కాంట్రాక్టర్ గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల వర్క్ డిలే అవుతోంది.
- నర్సింహాచారి, ఈఈ, ఆర్అండ్​బీ, మంచిర్యాల