కోడ్ చూసి కొట్టేశారు!..హైదరాబాద్లో మితిమిరీన అక్రమాలు

  • ఎన్నికల కోడ్​ సమయంలో బల్దియాలో ఎక్కువ అక్రమాలు
  • జీహెచ్ఎంసీ ప్రజావాణికి అక్రమ నిర్మాణాలపై ఎక్కువ ఫిర్యాదులు
  • కూల్చివేయాలని కమిషనర్, మేయర్​కు బాధితుల విజ్ఞప్తులు 

హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్​అమలులో ఉన్నంతకాలం జీహెచ్ఎంసీ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. లంచాలు తీసుకుని, కొందరు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. మొన్నటి దాకా ఉన్నతాధికారులు ఎన్నికలు, కౌంటింగ్​ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్​పోస్టులు పెట్టి ముమ్మర తనిఖీలు చేశారు. 

ఇదే అదునుగా బల్దియాలోని టౌన్​ప్లానింగ్​ఆఫీసర్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. తక్కువ ఫ్లోర్లకు అనుమతులు పొంది, పెద్ద ఎత్తున భారీ భవనాలు నిర్మిస్తున్నా.. అధికారులు చూస్తూ ఉండిపోయారని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మొత్తం 200 ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువ శాతం అక్రమ నిర్మాణాలపైనే ఉన్నాయి. అక్రమ నిర్మాణాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కూల్చివేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రాపాలిని వేడుకున్నారు.

భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం

కొందరు తన భూమిని కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఉప్పల్ కి చెందిన వినోద్ కుమార్ ఆరోపిస్తూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్​హయాంలో భూ కబ్జాలు ఎక్కువగా జరిగాయని, గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించాడు. సీఎం రేవంత్ రెడ్డి తనకు న్యాయం చేస్తాడన్న నమ్మకంతో ప్రజావాణికి వచ్చానని తెలిపాడు. 

న్యాయం చేయకపోతే వచ్చే వారం పెట్రోల్​బాటిల్​తో ప్రజావాణికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ సైతం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఓ వైపు వానలు మొదలైనప్పటికీ నాలాల్లో వ్యర్థాలు అలాగే ఉన్నాయన్నారు. పూడికతీత పనులు పూర్తిచేశామంటూ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని మండ్డిపడ్డారు. స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ప్రజావాణికి వచ్చానని తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతోపాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 200 ఫిర్యాదులు అందాయి. సర్కిల్ ఆఫీసులకు అందుతున్న ఫిర్యాదులను అధికారులు పట్టించుకోకపోవడంతో జనం పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. గతంలో మొత్తంగా 500 నుంచి 600 ఫిర్యాదులు వచ్చేవి.  

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: మేయర్

లోక్​సభ ఎన్నికల కోడ్​ముగిసిందని, ఇక నుంచి ప్రతి సోమవారం బల్దియా హెడ్డాఫీసులో ప్రజావాణి ఉంటుందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం హెడ్డాఫీసులో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 27 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వీటితోపాటు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 8 ఫిర్యాదులు వచ్చాయన్నారు.   అన్నింటిని వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రాపర్టీ టాక్స్ లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని,  వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

హైదరాబాద్​ కలెక్టరేట్​కు 62 ఫిర్యాదులు

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 62 ఫిర్యాదులు అందాయి. ఇందులో గృహ నిర్మాణ శాఖకు 28, డీఈఓకు 7, సివిల్ సప్లై అధికారులకు1, ఎక్సైజ్ శాఖకు1, ఇతర శాఖలకు సంబంధించినవి 25 ఉన్నాయి. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారి వెంకటాచారి అధికారులకు సూచించారు. అలాగే సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 79 ఫిర్యాదులు అందాయి. సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. అడిషనల్​కలెక్టర్ భూపాల్ రెడ్డి, డీఆర్ఓ సంగీత పాల్గొన్నారు.

జోన్ ​స్థాయిలో న్యాయం జరగట్లే..

తమ ఇంటి పక్కన అక్రమంగా ఆరు అంతస్థుల భవనాన్ని నిర్మించారని రాయదుర్గానికి చెందిన గాయత్రి అనే మహిళ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. అక్రమ నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్నామని మేయర్ విజయలక్ష్మికి చెప్పుకుని కన్నీరు పెట్టుకుంది. సర్కిల్, జోన్ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని, ఎవరికి ఫిర్యాదు చేసినా న్యాయం చేయట్లేదని వాపోయింది. తక్కువ ఫ్లోర్లకు అనుమతులు తీసుకుని, అదనపు ఫ్లోర్లు నిర్మిస్తున్నారని ఆరోపించింది. టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు పంపించి చేతులు దులుపుకున్నారే తప్ప సదరు బిల్డింగ్​పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పింది. స్పందించిన మేయర్​ విచారణ జరిపి న్యాయం చేస్తానని గాయత్రికి హామీ ఇచ్చారు.