- నిన్న సారుతో కారు పార్టీ మీటింగ్ కు..
- బీజేపీలో చేరాలంటూ కుమారుడు విశాల్ పట్టు?
- మందకృష్ణ ఇంటికి మారిన చేరిక ఎపిసోడ్!
- ఫోన్లు లిఫ్ట్ చేయని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే
- బీజేపీలో చేరడం పక్కా అంటున్న అనుచరులు
- అందుకే బీఆర్ఎస్ టికెట్ తిరస్కరించినట్టు టాక్
హైదరాబాద్: ఆరూరి రమేశ్ కమలం పార్టీలో చేరడం పక్కా అని తెలుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ తర్వాత హైదరాబాద్ లోనే ఉండిపోయిన ఆయన ఇవాళ ఉదయం నుంచి ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సమాచారం. రాజకీయ భవితవ్యం కోసం కచ్చితంగా బీజేపీలో చేరాలని ఆయన కుమారుడు విశాల్ పట్టుబట్టుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరూరి రమేశ్ మందకృష్ణ మాదిగతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
బీజేపీలో చేరికపై ఆయనతో చర్చిస్తున్నట్టు సమాచారం. నిన్నటి ఎపిసోడ్ తో వరంగల్, ఖమ్మం అభ్యర్థుల ప్రకటనను బీజేపీ అధినాయకత్వం పెండింగ్ లో పెట్టింది. తాను పార్టీ మారడం లేదంటూ నందినగర్ లోని సీఎం కేసీఆర్ నివాసం వద్ద ఆరూరి రమేశ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తానే మీటింగ్ కోసం హైదరాబాద్ వచ్చానని కూడా మీడియాకు తెలిపారు. రమేశ్ కు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఆఫర్ చేయగా తిరస్కరించారు.
తాను పోటీలో ఉండబోనని చెప్పారు. దీంతో వరంగల్ టికెట్ ను కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయిస్తున్నట్టు గులాబీ బాస్ ప్రకటించారు. ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందని సమాచారం. కచ్చితంగా బీజేపీలో చేరాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఎంట్రీ ఇచ్చారని, తన ఇంటికి పిలిపించుకొని కౌన్సెలింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ లీడర్లు ఫోన్లు చేస్తే రమేశ్ ఎత్తడం లేదని సమాచారం.
చేరిక ఇక్కడే?
ఆరూరి రమేశ్ ఢిల్లీ వెళ్లినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా కొందరైతే బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారని, కాసేపట్లో కాషాయ కండువా కప్పుకోబోతున్నారని రాశారు.
అయితే కిషన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం వరకు యూసూఫ్ గూడలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరూరి రమేశ్ కాసేపట్లో హైదరాబాద్ లోనే కాషాయ కండువా కప్పుకొంటారని సమాచారం. ఏది ఏమైనా రమేశ్ వరంగల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని ఆయన అనుచరులు బలంగా చెబుతున్నారు.