తెలంగాణలో సామాజిక సమీకరణం అవసరం లేదా?

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం రంకెలు వేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ‘సూటి రాజకీయాల’ కన్నా, కుట్రలు, కుహనాలు ఎక్కువవుతున్నాయి. ప్రతిపక్షాల పార్టీలో జరుగుతున్న ప్రతిస్పందనలకు కారణాలు అధికార పార్టీ వైపే చూపిస్తున్నాయి. రాష్ట్రంలో జరిగే ‘రాజకీయవార్త’ల సోర్సును ప్రభుత్వమే నిర్ణయిస్తోందని మనకు అర్థం అవుతున్నది. కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిని వాళ్ల పార్టీ టార్గెట్​ చేసినప్పుడు వేళ్లు కేసీఆర్​వైపు చూపిస్తున్నారు. ప్రస్తుతం బండి సంజయ్​ టార్గెట్​గా నడుస్తున్న గుసగుసలు కూడా బీఆర్​ఎస్​వైపు అనుమానపు చూపులుగా భావిస్తున్నారు. దీనికంతా కారణం కేసీఆర్​నడుపుతున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కుట్రలు  ఎదుర్కొనే నైపుణ్యం రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్​రెడ్డికి ఉందనీ, బండి సంజయ్​ని అమాయకుడిగా, సరిపోని వ్యక్తిగా నిలబెట్టాలని చూస్తున్నారు.

ఎన్నికల్లో గెలిపించి..

2014 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన రేవంత్​రెడ్డి ఎన్ని ఎన్నికలు గెలిపించారు? డా. లక్ష్మణ్, బండి సంజయ్​ ఆధ్వర్యంలో ఎంత రాజకీయమార్పు జరిగింది? అనే రెండు అంశాలు చర్చకు రానివ్వడం లేదు. ఎందుకంటే ఇద్దరూ బహుజన బిడ్డలే. డా. లక్ష్మణ్​ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దానికి చంద్రబాబు కేసీఆర్ తో కలిసి  చేసిన  కుట్ర అని అందరికీ తెలుసు. బీజేపీ తరపున రాజాసింగ్​ఒక్కరే గెలిచారు. కానీ ఆ వెనువెంటనే జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో 4 పార్లమెంట్​సీట్ల గెలుపు అనూహ్యం. ఒక్కసారిగా భాజపా ఓట్ షేర్ కూడా పెరిగిపోయింది. అందులో కేసీఆర్​ కూతురు, కేసీఆర్  దగ్గర బంధువు ఓడిపోవడం వెనుక డా. లక్ష్మణ్​ వ్యూహం లెక్కలోకి తీసుకోరు. టీడీపీ, కాంగ్రెస్​ బాధ్యతల్లో ఉన్నపుడు  రేవంత్​రెడ్డి పార్టీలో గెలిచి కేసీఆర్​పంచన చేరిన వారిని నిలువరించలేకపోయాడు. మరి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్​ వరుసగా దుబ్బాక, హైదరాబాద్, జీహెచ్​ఎంసీ, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం కట్టబెట్టారు. మునుగోడు, గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి గౌరవ స్థానం కల్పించాడు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండనే కారణంతో ఎవరు ఎదిరించలేని స్థితిలో ఉంటే గట్టిగా ప్రశ్నించింది బండి సంజయ్. అది తన వెనుకున్న పార్టీ బలం కావచ్చు అతని నిజాయితీ కావచ్చు. ఇదంతా ఇద్దరు బీసీ నాయకుల శ్రమనే. కానీ ఇక్కడ ఇది చర్చకు రానివ్వరు. దీని వెనుక సామాజిక ఆధిపత్య శక్తుల ప్రాబల్యమే. సోషల్​ మీడియా మొదలుకొని మేధో పీఠాలపై  కూర్చున్న వాళ్లు ఈ చర్చను సమాజంలోకి పోనివ్వరు.

దళితులకు గుర్తింపేది?

బీసీ రిజర్వేషన్ల నుంచి లాగి వైఎస్సార్​4 శాతం రిజర్వేషన్లు ముస్లిం మైనార్టీలకు ఇచ్చినప్పుడు ఏ ప్రగతిశీల మేధావీ నోరు తెరవలేదు. కేసీఆర్​ ముస్లింలకు 12 శాతం ఇస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసినా ఒక్కరూ ‘ఇది ఎక్కడి నుంచి కోత పెట్టి ఇస్తారు ?’ అని ప్రశ్నించలేదు. తెలంగాణ వచ్చాక 25 కులాలకు పైగా బీసీ జాబితా నుంచి తొలగిస్తే ఒక్కరూ వాళ్ల తరఫున గొంతెత్తలేదు. ఆంధ్రా కాంట్రాక్టర్లు, పైరవీకారులు, రియల్టర్లు తెలంగాణలో  డబ్బు సంపాదించుకోవడానికి లేని అభ్యంతరం ఈ కులాలు రిజర్వేషన్​ఫలాలు అనుభవిస్తే అడ్డుపుల్ల ఎందుకు? ఇదంతా బీసీ కులాలపై జరుగుతున్న దమనకాండ. ఇంత జరుగుతున్నా తెలంగాణ బీసీ కమిషన్​నోరు విప్పదు కానీ, మైనార్టీ  రిజర్వేషన్ల   కోసం రాత్రికి రాత్రి రిపోర్ట్​మాత్రం ఇస్తుంది. అలాగే తెలంగాణ భూభాగంలో దళితుల పాత్ర గణనీయమైంది. ఏడవనిజాం లక్ష మంది దళితులను టార్గెట్ చేసి మతమార్పిడి చేసేందుకు  దీన్ దార్ అంజుమన్  అనే సంస్థను పరోక్షంగా ప్రోత్సహించాడు. ఆ ఆటుపోట్లను తట్టుకొని దళితులు తెలంగాణ విమోచన కోసం నిలబడ్డారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన  ఆర్య సమాజం నాయకులతో కలిసి తెలంగాణ విమోచన కోసం పోరాటం చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్టులు రెచ్చగొట్టిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని వందలాదిమంది అమరులయ్యారు. వాళ్ల కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. 

సాయుధ పోరాటంలో మరణించిన వాళ్లలో ఎక్కువమంది దళితులే. అలాగే తెలంగాణలో దొరల దగ్గర పటేల్ పట్వారీల దగ్గర దేశముఖ్ ల దగ్గర వెట్టి చాకిరి చేసింది దళితులే. కష్టమైన పరిస్థితుల నుంచి నాయకులుగా ఎదిగి వచ్చిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బీఎస్ వెంకట్రావు సుమిత్ర దేవి, ఈశ్వరీ భాయి, టీఎన్ సదా లక్ష్మి, జీ. వెంకటస్వామి... వంటి అనేకమంది కనిపిస్తారు. వీళ్లంతా ఒకవైపు సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ రాజకీయం చేసిన వాళ్లే. అలాగే తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమంలో అనేక మంది దళితులు ఈ నేల విముక్తి కోసం ప్రాణాలర్పించారు. నిట్ట నిలువునా తెలంగాణ కావాలని ఆత్మహత్యలు చేసుకున్నారు. దళిత సమాజంలో భాగమైన ఆటపాటను ధూంధాం పేరుతో గజ్జగట్టి ఊరు ఊరు తిరిగి ప్రజలను చైతన్యం చేశారు. అలాంటి దళిత సమాజం కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ కమిషన్ కనీసం మీ సభ్యులైనా నియమించుకోండి అని హైకోర్టు చెప్పినా పట్టించుకోని పాలనలో ఉంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎంత దుర్వినియోగం జరిగినా ప్రశ్నించే గొంతుకలు అధికారం చుట్టూ చేరి కుట్రలకు వాద్య సహకారం అందిస్తున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ కుల నిర్మూలన పేరుతో పుస్తకం రాస్తే ఇప్పుడు కులాలకు భవనాలు నిర్మిస్తూ కులాలకు శాశ్వతత్వం కల్పిస్తున్నారు. మనం చేయాల్సింది కుల నిర్మూలన కదా అని అడగాల్సిన మేధావులు కుల భవనాల్లో వేసిన శిలాఫలకంపై పేరును చూసి మురిసిపోతున్నారు. ఈ చరిత్ర అంతా చూస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో భట్టికి పాదయాత్ర చేసి బొబ్బలెక్క వలసిందే కానీ అధికార పీఠంపై కూర్చోవడం అసాధ్యం. తెలంగాణ తొలి దళిత కవి దున్న ఇద్ధాసులాంటి మహానుభావుడికి ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. ఇదంతా వర్తమాన చరిత్ర.

సమాజంలో 50 శాతంపైగా ఉన్న కులాలకు అన్యాయం జరగకూడదంటే కనీసం చెప్పుకోవడానికైనా ఒకసారి బీసీ సీఎం కావాలి. అది ఒకే ఒక్క అవకాశంగా బీజేపీ కనిపిస్తోంది. బండి సంజయ్​ నేతృత్వంలో బలపడ్డ పార్టీ సరిగ్గా అధికారంలోకి వచ్చే సమయంలో అక్కడ కుట్ర మొదలు పెట్టిందెవరో అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్​లో యాదవేతర, జాతవేతర బహుజన కులాలతో సామాజిక సమీకరణ చేసిన బీజేపీ నాయకత్వం ఇక్కడ ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో సోషల్ ​ఇంజనీరింగ్​చేస్తున్న మోదీ షా ద్వయం ఇక్కడ మాత్రం వెనుకడుగువేస్తే భవిష్యత్​ క్షమించదు. ఎన్టీఆర్​ తెలంగాణలోని బీసీ వర్గాలను కలుపుకొనే రాజకీయ వేదిక సుస్థిరం చేసుకున్నారు. రోజూ ప్రెస్​క్లబ్​లో మేధో వేదికల్లో బీసీ–బహుజన కులాల గురించి మాట్లాడే వాళ్లంతా బీసీలకు ‘రివర్స్ గేర్  గా పనిచేసే వారే. వాళ్లంతా సీపీఎం, సీపీఐ అగ్రకుల బూర్జువాశక్తుల టూల్​కిట్స్. వీళ్లు బహుజన నాయకులను భ్రూణ హత్య చేస్తుంటారు. నక్సలైట్లలో కులతత్వాన్ని గురించి ఆలోచించిన శివసాగర్, మారోజు వీరన్న అయినా, తెలంగాణా ఆవశ్యకతను గురించి మాట్లాడిన కొండా లక్ష్మణ్​ బాపూజీ, ఆచార్య కె. జయశంకర్​అయినా అందరూ వీళ్ల భుజాల మీదకు ఎక్కి వీళ్లకు కావాల్సిన వ్యక్తులను అందలం ఎక్కిస్తారు.  బండి సంజయ్ రూపంలో తెలంగాణ బీజేపీని పోటీలో నిలిపితే దాన్ని విఫలం చేసేందుకు భయంకరమైన కుట్రకు తెలంగాణ రాష్ట్రంలో తెరలేసింది. ఈటల రాజేందర్ లాంటి పరిపక్వత ఉన్న నాయకుడు సంజయ్ తో కలిసి కాడెద్దుల్లా పని చేయాల్సింది పోయి ఈ ఆపరేషన్ లో భాగస్వామి అయితే తర్వాత వరుసలో నిలబడేది ఆయనే. గతంలో ఎప్పుడూ లేనంత గొప్పగా అన్ని కులాల వారు భాగస్వామ్యం ఊహించి పార్టీలో దండలోని రంగురంగుల పూలల్లా కనిపిస్తున్నారు. సరిగ్గా శత్రువుతో తెలపడాల్సిన సమయంలో ప్రజా గొంతుకను చంపుకుంటే అది ఆత్మహత్య సదృశం. 

రోజూ బహుజన కులాల గురించి మాట్లాడే కమ్యూనిస్టులు, వాళ్ల మేధావులు నరేంద్ర మోడీ ఒక బీసీ కులస్తుడు అంటే ఒప్పుకోరు. అలాగే బండి సంజయ్ ని మతతత్వ వాదిగా ముద్ర వేస్తారు. వాళ్లు బ్రాహ్మణికరణ అయ్యారని రోజూ మీడియాలో ఊదరగొడతారు. వాళ్ల పార్టీల్లో వ్యవస్థల్లో కనీసం కార్యవర్గంలో కూడా ఒక బీసీని, దళితుడిని సృష్టించలేరు. గొంతువరకు కులతత్వం నిండిపోయిన మార్క్స్ వాదులు మోదీ పీఠం ఎక్కినప్పటి నుంచి ఎలా గోల చేస్తున్నారో ఇక్కడా అదే పరిస్థితి. బీజేపీ నాయకత్వం ఇదంతా అర్థం చేసుకోకుండా చేసే ఏ చర్య అయినా ‘పాలిచ్చే బర్రెను అమ్ముకొని తన్నే దున్నపోతు’ను కొనుక్కోవడమే.

 

సీఎం పీఠంపై బీసీలేరి?

అదే మన తెలంగాణ ముఖచిత్రం చూస్తే 2014కు ముందు తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కేసీఆర్​అన్నారు. తెలంగాణలో కేసీఆర్​ రాజకీయ ప్రభ ముందు ఆ హామీ నీరుగారిపోయింది. ఒక్కరూ ఈ విషయంపై ఈరోజు వరకు నిర్దిష్టమైన చర్చ చేయలేదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దామోదరం సంజీవయ్య అనే దళిత నాయకుడు సీఎం అయ్యాడు. మిగతా వారంతా కేవలం నాలుగు కులాల వారే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారు. బీసీ కులాలకు చెందిన ఏ వ్యక్తీ ఇంత వరకు తెలుగు రాష్ట్రాలకు సీఎంగా పని చేయలేదు. ఏమైనా అంటే కేసీఆర్ అన్ని కులాల వాళ్లకు సంబంధించిన ఛాంపియన్ గా పనిచేస్తున్నాడని దబాయిస్తారు. సమాజంలో సగం జనాభా ఉన్న బీసీ కులాల నుంచి 75 ఏండ్ల నుంచి సీఎం పీఠం ఎక్కలేదు అంటే ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నాయి. చిత్రం ఏమిటంటే బహుజన సమాజానికి కూడా ఈ విషయంపై అవగాహన లేదు. 

తెలంగాణలో ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెలంగాణకు బీసీ, దళిత సీఎంకు అవకాశం లేదనిపిస్తోంది. ఈ రాష్ట్రం బీఆర్ఎస్​ చేతిలో ఉన్నా, కాంగ్రెస్ ​చేతిలో ఉన్నా అంతే సంగతులు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్​రావులను దాటి ఇతర కులాలకు ముఖ్యంగా బీసీ కులాలకు అవకాశమే లేదు. కాంగ్రెస్​ మళ్లీ ఒకే సామాజికవర్గంతో నిండుతోంది. కర్నాటక ఎన్నికల్లో బీసీల గణన గురించి ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్​ఇక్కడ తేలు కుట్టిన దొంగలా మిన్నకుండింది. కమ్యూనిస్టు పార్టీ  జాతీయస్థాయిలో ఒక కులం చేతిలో, తెలుగు రాష్ట్రాల్లో రెండు కులాల చేతుల్లో బందీ అయింది. ఎందుకు  తెలంగాణలో బీసీ సీఎం కావాలంటే ఎవరూ సమాధానం చెప్పరు? 

‑ కాల భైరవుడు