- పార్టీ మార్పుపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయని నాగేశ్వరరావు
- కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
- మాజీ మంత్రి టార్గెట్గా అజయ్, కందాల విమర్శలు
- ఇది పొగపెట్టడమే అంటున్న తుమ్మల అనుచరులు
ఖమ్మం, వెలుగు : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తుమ్మల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీని వీడుతున్నట్టు అధికారికంగా ఆయన ప్రకటించలేదు. రాజీనామా కూడా చేయలేదు. కానీ, తమ పార్టీలోకి రావాలంటూ కాంగ్రెస్ నేతలు అయనను కలిసి వెళ్తున్నారు. వారికి కూడా తుమ్మల ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా మొన్న కందాల, తాజాగా అజయ్ చేసిన కామెంట్లుచర్చనీయాంశంగా మారాయి. తనకు పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తుమ్మల.. బీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఆయనను వరుసగా కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వేర్వేరుగా ఇప్పటికే తుమ్మలను కలిసి కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. కానీ, తుమ్మల మాత్రం తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించి, వాళ్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన ఆయన.. వెయ్యికి పైగా కార్లతో నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ టైంలో బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ ఫొటోలు లేకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే వార్తలు వచ్చాయి.
అజయ్, కందాల వర్సెస్ తుమ్మల మద్దతుదారులు
ఖమ్మంలో తాజాగా నిర్వహించిన కమ్మ కమ్యూనిటీ ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మంత్రి అజయ్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. సీఎం కేసీఆర్ అందరికీ అవకాశాలిచ్చారని, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కొందరు ఫెయిల్ అయ్యారని అజయ్ అన్నారు. ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రిని చేశారన్నారు. ఖమ్మంలో ఓడిపోగానే పాలేరు వెళ్లి ఇప్పుడు ఏవో మాటలు చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దని వ్యాఖ్యానించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు కేసీఆర్ వల్లే ఖమ్మానికి వస్తాయి తప్ప ఇతరుల వల్ల ఎప్పటికీ రావని తుమ్మలను ఉద్దేశిస్తూ అజయ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతకుముందు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా తుమ్మలను టార్గెట్ చేశారు.
2014 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయడం తప్పా అని ఎద్దేవా చేశారు. మంత్రిపదవి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే 2018 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిపించుకోకపోగా, ఆయనే గెలవలేకపోయారని, దీనికి ముఖ్యమంత్రి ఏం చేస్తారని కందాల వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అందరికీ అవకాశాలు రావని, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఇలా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ లీడర్లు తుమ్మలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై ఆయన అనుచరులు సోషల్ మీడియాలో సీరియస్ గా స్పందిస్తున్నారు. నమ్మకద్రోహం చేసింది కాక మళ్లీ నాటకాలెందుకు అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘‘ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిపదవి ఇచ్చారు అంటున్నారు. దారిన పోయే దానయ్యకు ఇచ్చారా? ఆయన వల్ల ఉమ్మడి జిల్లాలో పార్టీ లబ్ధి పొందలేదా?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఒక ఎమ్మెల్సీని, డీసీసీబీ చైర్మన్ ని, డీసీఎంఎస్ చైర్మన్ ని, 800 మంది సర్పంచ్ లని, 300 మంది ఎంపీటీసీలని, గ్రామాల్లో వేలాది మంది కార్యకర్తలని, నాయకులని తీసుకొని తుమ్మల టీఆర్ఎస్ లో చేరితేనే కదా, పదవి ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.