చింతల ఘర్​ వాపసీ

యాదాద్రి, వెలుగు : బీఆర్ఎస్​ లీడర్​ చింతల వెంకటేశ్వర్​రెడ్డి ఘర్‌‌ వాపసీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.  బీఆర్ఎస్​లో ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఈ మేరకు  పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నామని, అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని బుధవారం ‘వెలుగు’తో చెప్పారు.   తొమ్మిదేళ్లు బీఆర్ఎస్‌లో ఉన్న తనకు సీఎం కేసీఆర్‌‌ ప్రాధాన్యం ఇవ్వలేదని, ఎమ్మెల్సీ , ఎమ్మెల్యే టికెట్​ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు.  సీఎంతో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదని, కనీసం ఆయనను కలిసే అవకాశం కూడా దొరకదని చెప్పుకొచ్చారు.

మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు లాంటి లీడర్‌‌కే అపాయింట్​మెంట్ లభించడం లేదని వాపోయారు. మండలి వైస్​చైర్మన్​గా నేతి విద్యాసాగర్​రావుకు మూడేండ్లు కూడా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు.  2014లో తనకు కాంగ్రెస్​ టికెట్​రాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అడ్డుకోవడంతోనే బీఆర్‌‌ఎస్‌లో చేరానని తెలిపారు. 

ఉప ఎన్నికల్లో ఓటమి..

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వర్​రెడ్డి రాజకీయ ప్రస్తానం ఎన్ఎస్​ఐయూతో మొదలైంది. 1985 నుంచి 1995 వరకూ ఎన్‌ఎస్‌యూఐలో బాధ్యతలు నిర్వర్తించారు.  అనంతరం యూత్​కాంగ్రెస్​లో కీలకంగా వ్యవహరించారు. 2000 నుంచి 14 ఏండ్ల పాటు కాంగ్రెస్​లో కొనసాగిన చింతల భువనగిరి నియోజకవర్గానికి ఇన్​చార్జ్​గా వ్యవహరించారు. 2000లో భువనగిరి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

అప్పట్లోఆయన  వైఎస్ రాజశేఖర్​రెడ్డి సహా కాంగ్రెస్​ ముఖ్యులతో మంచి సంబంధాలు ఉండేవి.  తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ  చింతలకు టికెట్​ రాలేదు. దీంతో ఆయన బీఆర్ఎస్​అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారని ఆప్పట్లో ప్రచారం జరిగింది. 2014 జూలైలో ఆయన కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీఆర్ఎస్​లో చేరారు. 

టికెట్​ ఆశించినా..

సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ​ వెంకట్రామారెడ్డికి చింతల వెంకటేశ్వర్​రెడ్డి దగ్గరి బంధువు.  బీఆర్ఎస్​లోని ముఖ్య లీడర్లతోనూ  మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని వ్యతిరేకిస్తున్న చింతల భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని మీడియాలో పలుమార్లు స్టేట్​మెంట్లు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తానని లేకుంటే భువనగిరి అసెంబ్లీలో పోటీ చేయడానికి టికెట్​ ఇస్తానని సీఎం కేసీఆర్​ తనకు ప్రామిస్​ చేశారంటూ చెప్పుకొచ్చారు. అయితే బీఆర్​ఎస్​లోచేరి తొమ్మిదేండ్లయినా.. ఎలాంటి ప్రాధాన్యమివ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు.

తాజాగా కాంగ్రెస్​ నుంచి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి బీఆర్ఎస్​లో  చేరడంతో ఎమ్మెల్యే శేఖర్​రెడ్డితో కలిసి జోడెడ్లుగా పని చేయాలని సీఎం కేసీఆర్​ సూచించారు. దీంతో భువనగిరి అసెంబ్లీ సీటు తనకు దక్కదని చింతల  భావించినట్టు తెలుస్తోంది.  దీంతో ఆయన తిరిగి తన మాతృసంస్థ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.