నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగలనుందా..? టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌లోని కొన్ని మ్యాచులకు దూరం కానున్నాడా..? అంటే బీసీసీఐ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. నవంబర్ 22వ తేదీ నుండి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా అతిథ్యం ఇవ్వనున్న ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే, ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ నేపథ్యంలో ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. టెస్ట్ చాంపియన్ షిప్లో అడుగు ముందుకు వేయాలంటే భారత్ కచ్చితంగా ఈ సిరీస్ గెలిచి తీరాల్సిందే.
ఇలాంటి పరిస్థితిలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో ప్రారంభ రెండు మ్యాచులకు అందుబాటులో ఉండలేనని రోహిత్ శర్మ బీసీసీఐకి చెప్పినట్లు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ భార్య రితీక గర్భవతి. ఆమె నవంబర్‌లో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉండాలని నిర్ణయించుకున్న రోహిత్.. ఆసీస్ సిరీస్‌లోని రెండు మ్యాచులకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో నవంబర్ 22 నుండి 26 వరకు పెర్త్, డిసెంబర్ 6- నుండి10వ తేదీ వరకు ఆడిలైడ్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచులకు రోహిత్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు.
ALSO READ : ENG vs PAK 1st Test: తీసుకున్న గోతిలోనే పడ్డారు: ముల్తాన్ టెస్టులో ఓటమి దిశగా పాకిస్థాన్
ఒకవేళ సిరీస్ ప్రారంభానికి ముందే రితీక శర్మ డెలివరీ అయితే.. రోహిత్ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని.. అలా జరగని పక్షంలో హిట్ మ్యాన్ స్టార్టింగ్ మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన రోహిత్.. టీమిండియాకు ఎంతో కీలకమైన ఆసీస్ పర్యటనకు దూరం అవుతారనే ప్రచారం భారత అభిమానుల్లో ఆందోళన కల్గిస్తుంది. మరోవైపు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే భారత్‌ను నడిపించే వ్యక్తి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు బీసీసీఐ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.