- చక్రం తిప్పుతున్న ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ దిగ్గజం
- పార్టీ బలోపేతం కోసం పక్కా ప్లాన్
- కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య మంతనాలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిచూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్.. భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికలప్పుడు భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జిల్లా నుంచి మరో మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, కో–ఆపరేటివ్‌బ్యాంకు చైర్మన్, కార్పొరేషన్మాజీ చైర్మన్లు కాంగ్రెస్ లో చేరేందుకు పార్టీ సీనియర్లతో రహస్య మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది.
తెరవెనక చక్రం తిప్పుతున్న అగ్రనేత..
నల్గొండకు జిల్లాకు చెందిన కాంగ్రెస్అగ్రనేత, బీఆర్ఎస్కు చెందిన మరో అగ్రనేత కలిసి తెరవెనక చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్నామరూపాలు లేకుండా పోతుందని పక్కా ప్లాన్ రూపొందించారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, భవిష్యత్‌లో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పార్టీకి తిరుగులేకుండా ఉండేలా చేరికల వ్యూహాన్ని పక్కాగా ప్లాన్చేస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం రావాలంటే ముఖ్యమైన బీఆర్ఎస్నేతలను పార్టీలోకి చేర్చుకుంటే రాజకీయంగా పట్టుసాధించవచ్చని అగ్రనేతలు భావిస్తున్నారు.
లోకల్ ఎన్నికల్లో మరింత బలం..
ఇప్పటికిప్పుడు చేరికల వ్యవహారం బయటపడితే జిల్లాలో కాంగ్రెస్గ్రూపు తగాదాలు మళ్లీ మొదలవుతాయని జాగ్రత్త పడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్‌పాలన సజావుగా సాగేందుకు ఈ చేరికలు దోహదపడతాయని కాంగ్రెస్సీనియర్లు చెబుతున్నారు. అంతేగాక జూన్ నుంచి జనవరి వరకు లోకల్‌బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ బ్యాంకు చైర్మన్, మదర్‌డెయిరీ చైర్మన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక పదవుల్లో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల హవా కొనసాగుతుందని సీనియర్‌నేత ఒకరు 'వెలుగు'తో చెప్పారు.