దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీని ‘హైబ్రిడ్’ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ దాదాపుగా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం వర్చువల్‌గా జరిగే బోర్డు మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయానికి రానుంది. అలాగే పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ఇందులో చర్చించి వేదికలను ఖరారు చేయాలని భావిస్తోంది. హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అనుకూలంగా లేకపోతే టోర్నీ మొత్తాన్ని ఆ దేశం నుంచి తరలించేందుకు కూడా గవర్నింగ్ బాడీ ఆలోచనలు చేస్తునట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఈ టైమ్‌లో హైబ్రిడ్ మోడల్ కంటే మరో ఉత్తమమైన మార్గం లేదు. టోర్నీలో పాల్గొనే మిగతా దేశాలు కూడా దీనికి అనుకూలంగా ఉన్నాయి. కానీ పాక్ మాత్రమే అభ్యంతరం చెబుతోంది. వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికైతే అన్ని జట్లు ఇందులో పాల్గొంటాయి’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.
ఆర్థికంగా నష్టం..
పొరుగు దేశంతో ఉన్న రాజకీయ అనిశ్చితి వల్ల ఇండియా టీమ్‌ను పాక్‌కు పంపలేమని బీసీసీఐ.. ఐసీసీ దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఆతిథ్య హక్కులను పాక్ వద్దనే ఉంచి హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ప్లాన్స్ రెడీ చేసింది. అయితే దీనికి మొదట్లో ఓకే చెప్పిన పీసీబీ తర్వాత వెనకడుగు వేసింది. మళ్లీ చర్చలు మొదలుపెట్టిన ఐసీసీ రెవెన్యూ షేరింగ్, ఇండియా ఆడే మ్యాచ్‌లను మాత్రమే బయట జరిగేలా ఒప్పించేందుకు ప్రయత్నించినా పీసీబీ పట్టు వీడటం లేదు.
ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తే ఆర్థికంగా భారీ నష్టం రావడంతో పాటు ట్రోఫీ కళ తప్పుతుందని ఐసీసీ భావిస్తోంది. దీంతో ఎలాగైనా పాక్‌ను హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పించాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉంది. టోర్నీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో బ్రాడ్‌కాస్టర్స్ నుంచి కూడా ఐసీసీపై తీవ్ర ఒత్తిడి ఉంది. రూల్స్ ప్రకారం 90 రోజులు ముందుగా షెడ్యూల్, వేదికలను ఖరారు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అది అమలు కాకపోవడంతో భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుందని వాళ్లు భయపడుతున్నారు.
Also Read:-ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన టీమిండియా
మరోవైపు ఇండియా, పాకిస్తాన్‌లను వేర్వేరు గ్రూప్‌ల్లో ఉంచి ఆడిస్తే ఎలా ఉంటుందనే వాదనను కూడా తెరపైకి తెస్తున్నారు. కానీ దీనికి బ్రాడ్‌కాస్టర్లు, ఫ్యాన్స్ అసలు ఒప్పుకోకపోవచ్చు. లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్ ఆడినా నాకౌట్‌లోనూ ఎదురుపడితే దాన్ని బోనస్‌గా భావిస్తారు. అలాంటి మ్యాచ్‌ల కోసం క్రికెట్ వరల్డ్ మొత్తం ఆతృతగా ఎదురుచూస్తుంది. కాబట్టి ఎలాగోలా పాక్‌ను ఒప్పించేందుకే ఐసీసీ మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. మరి దీనికి పాక్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.