హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫండ్ దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎస్ఎఫ్సీ స్టూడెంట్ల నుంచి వచ్చే ఫీజులను కేవలం ఆయా కోర్సుల స్టాఫ్ వేతనాలు, స్టేషనరీ, ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉండగా, వేరే పనుల కోసం రిజిస్ట్రార్ ఫండ్ కు డైవర్ట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఎఫ్సీ ఖాతా నుంచి విడతల వారీగా రూ.20 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ చేయించుకుని, వాటిని న్యాక్ అవసరాల పేరిట ఖర్చు చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సరిపడా బడ్జెట్ లేదంటూ తమకు జీతాల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని ఎస్ఎఫ్సీ పార్ట్‌టైం లెక్చరర్స్ ఆరోపిస్తున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీల నుంచి..
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని18 అనుబంధ పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 20కి పైగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుండగా..ప్రతి ఏడాది సుమారు ఆరు వేల మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఆయా కోర్సులకు సంబంధించిన విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఏటా రూ.6 కోట్లకు పైగానే ఎస్ఎఫ్సీ అకౌంట్లలో జమవుతాయి. వీటిలో 95 శాతం వర్సిటీ క్యాంపస్‌లోని ఎస్ఎఫ్సీ అకౌంట్‌కు బదిలీ చేస్తే, ఆ ఫండ్‌ను అదే కోర్సులకు సంబంధించిన పార్ట్ టైం లెక్చరర్స్‌కు రెమ్యూనరేషన్ చెల్లించడానికి ఉపయోగించాలి. మిగతా 5 శాతం ఆయా కాలేజీల స్టేషనరీ, సెమినార్స్ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం వాడుకోవాలి. కానీ ఆ ఫండ్స్‌ను అక్రమంగా రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్‌కు బదిలీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
న్యాక్ పేరుతో అత్యవసరంగా ప్రతి కాలేజీ నుంచి ఎస్ఎఫ్సీ ఫండ్ ను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫండ్ కు బదిలీ చేయాలని గత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్ రావు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. ఆ మేరకు మహిళా ఇంజినీరింగ్ కాలేజీ నుంచి రూ.2 కోట్లు, కో -ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి రూ.2 కోట్లు, కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీ నుంచి రూ.2 కోట్లు, ఆర్ట్స్ కాలేజీ నుంచి రూ.కోటి, లా కాలేజీ నుంచి రూ.40 లక్షలు, ఎస్డీఎల్సీఈ నుంచి రూ.2 కోట్లు ఇలా ఇతర కాలేజీల నుంచి మొత్తం రూ.20 కోట్ల వరకు సెంట్రలైజెడ్ అకౌంట్స్ పేరు మీద వర్సిటీ రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నారని తెలిసింది. ఆ నిధులను న్యాక్పనులకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
విచారణ చేపట్టాలని డిమాండ్
ఎస్ఎఫ్సీ పార్ట్ టైం లెక్చరర్ల జీతాల చెల్లింపునకు వినియోగించాల్సిన నిధులను ఇతర పనులకు మళ్లించడంతోనే జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని కొందరు పార్ట్ టైం లెక్చరర్లు వాపోతున్నారు. ఎంసీజే లాంటి డిపార్ట్మెంట్లో నెలల తరబడి రెమ్యూనరేషన్ఇవ్వడం లేదని, ఇందులోనూ వీసీ రమేశ్ కోత పెట్టారని ఆరోపిస్తున్నారు. దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కేయూ వీసీపై విజిలెన్స్ఎంక్వైరీకి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ఈ ఫండ్స్ బదలాయింపుపైనా ఎంక్వైరీ జరిపించాలని పార్ట్‌టైం లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. తమకు సక్రమంగా జీతాలు చెల్లించడంతో పాటు ఎస్ఎఫ్సీ నిధులను బదిలీ చేసి అక్రమ నియామకాలు, అక్రమ బిల్లుల చెల్లింపులకు ఖర్చు చేసిన వీసీ, రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎస్‌ఎఫ్‌సీని నుంచి తీసినట్టు కాదు
ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఫండ్ తీస్తే మొత్తం ఎస్ఎఫ్సీ కోర్సుల నుంచి తీసినట్టు కాదు. మొత్తం ఎస్‌ఎఫ్‌సీని ఒకటిగా కాకుండా కోర్సు వైజ్‌గా చూడాలి. ఇంజినీరింగ్ కోర్సులు తప్ప మిగతా ఎస్ఎఫ్సీ కోర్సుల్లో సీట్లే నిండడం లేదు. అందుకే సిబ్బంది జీతాల చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్