యాదాద్రి, వెలుగు: ఎప్పటిలా ఉండకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో పర్యటించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువాలు వేసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న ఓ వ్యక్తితో 'మా కేసీఆర్ సార్ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండే. టీడీపీలోకి పోయిండు. తర్వాత టీఆర్ఎస్ పెట్టిండు. తెలంగాణ వచ్చింది. మనం కూడా ఎప్పటిలా కాకుండా ఎట్ల బాగుంటే అట్ల చేసుకోవాలె.' అని అన్నారు. బీజేపీకి చెందిన క్రియాశీలక కార్యకర్తకు కండువా వేస్తూ ‘ఏముందయ్య బీజేపీలో. ఇప్పుడు మంచిగా చేసుకో ’ అని అన్నారు. తర్వాత ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓ ఇంటి వద్ద ఆగిన మంత్రి ఓ వృద్ధురాలితో మాట కలిపారు. పింఛన్ వస్తుందా? అని అడగడంతో ఆమె రావడం లేదని చెప్పింది.
ఆమె కొడుకు ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి రావడం లేదని తెలుసుకొని ‘నీ కొడుక్కు రూ. 12 వేలు జీతం పెంచినం. టీఆర్ఎస్కు ఓటెయ్’ అంటూ ముందుకు కదిలారు. ప్రచారంలో భాగంగా కొందరు మహిళలను పలకరించారు. ‘ఎస్సీ కాలనీలో అంగన్వాడీ సెంటర్, బిల్డింగ్లేక మీటింగ్చెట్ల కింద పెట్టుకుంటున్నం. శ్మశానవాటికలో వసతులు కావాలి’ అని కోరారు. దీంతో ఆయన ‘రెండు మూడు రోజుల్లోనే పనులు స్టార్ట్ చేయిస్తా. అంగన్వాడీ సెంటర్‌కు ప్రొసీడింగ్ఇప్పిస్తా. తెలిసిన కాంట్రాక్టర్ ఉంటే పనులు స్టార్ట్ చేయించుకోండి. శ్మశానవాటికకు రోడ్డు, వసతులు కల్పిస్తాం. సంఘ బంధం బిల్డింగ్ కూడా ఇప్పిస్తా’ అని హామీ ఇచ్చారు. చౌటుప్పల్ మండలం డీ నాగారలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సంస్థాన్ నారాయణపురం మండలం మర్రిబాయి తండాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, నన్నపనేని నరేందర్, చేనేత రాష్ట్ర సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.