ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఫ్రెండ్స్‌ని కనెక్ట్ చేసే ప్లాట్‌ఫాం మాత్రమే. కానీ, ఇప్పుడు అందరి జీవితాల్లో అదొక ఇంపార్టెంట్ పార్ట్ అయ్యింది. ఎంతలా అంటే ఒక రెండుమూడు గంటలు వాడకపోతే ఎఫ్. ఓ. ఎమ్. ఓ ( ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్) అటాక్ చేస్తోంది. దానివల్ల డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోతోంది. దీన్నుంచి బయటపడటానికి.. సోషల్ మీడియా టాక్సిసిటీని హ్యాండిల్ చేయడానికి హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్ కోచ్ పూజ కెరా చెబుతున్న టిప్స్ ఇవి.
యాక్సెప్ట్ చేసేముందు..
ఎవరైనా ఫాలో లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ల ప్రొఫైల్లోకి వెళ్లి కామన్ ఫ్రెండ్స్, పోస్ట్‌లని చూడాలి. వాళ్లు ఏ పోస్ట్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నారో చెక్ చేసుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్‌గా కొందరు వాళ్ల ఫొటోలకి బదులు హీరోహీరోయిన్లు, నేచర్ ఫొటోలని పెడుతుంటారు. పోస్ట్‌లు కూడా పెద్దగా పెట్టరు. అలాంటివాళ్ల రిక్వెస్ట్లని యాక్సెప్ట్ చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో చాలా వరకు ఫేక్ ఐడీలే ఉంటాయి.
అన్ ఫాలో..
కొంతమంది సంబంధం లేకుండా పోస్ట్‌లకి చెత్త కామెంట్లు పెడుతుంటారు. మన ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు కూడా కొన్నిసార్లు కామెంట్ సెక్షన్లో పర్సనల్ విషయాలు, అనవసర డిస్కషన్స్ చేస్తుంటారు. నెగెటివ్ కామెంట్లు కూడా పెడుతుంటారు. అలాంటి వాళ్లని అన్‌ఫాలో చేయడానికి ఏ మాత్రం ఆలోచించకూడదు. ఒకవేళ మన మెంటల్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేసే అలాంటి వాళ్లని కట్చేయకపోతే ఆ ప్రభావం మిగతా ఫాలోవర్స్పైనా పడుతుంది. ప్రస్తుతం చాలా కంపెనీలు వెరిఫికేషన్స్లో భాగంగా సోషల్ మీడియాని కూడా చెక్ చేస్తున్నాయి. అందుకే వాళ్లని దూరంగానే ఉంచాలి.
హేటర్స్‌కి రెస్పాన్స్
మనపై నెగెటివ్ కామెంట్స్, పోస్టులు చూసినప్పుడు కోపం రావడం సహజం. కానీ, కోపం వల్ల సిచ్యుయేషన్ చెయ్యి దాటిపోతుంది. అందువల్ల ఆ కామెంట్లని సాధ్యమైనంతవరకు పట్టించుకోకపోవడమే మంచిది. ఒకవేళ నెగెటివిటీ మితిమీరితే మాత్రం కంప్లైంట్ ఇవ్వాలే తప్ప పర్సనల్‌గా వాదనకి దిగొద్దు. దానివల్ల ఆ నెగెటివిటీ మరింత పాకుతుంది. అలాగే మనల్ని ఇన్స్పైర్ చేసే పర్సన్స్‌ని ఫాలో అవ్వడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటున్నారు పూజ కెరా.