GHMCలో నాన్​స్టాప్ ​వాన.. అత్యధికంగా హయత్​నగర్​లో

GHMCలో నాన్​స్టాప్ ​వాన.. అత్యధికంగా హయత్​నగర్​లో
  • జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్: 040-21111111
  • రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​కంట్రోల్​రూమ్: 040-23237416

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో శనివారం తెల్లవారుజామున మొదలైన వాన రోజంతా కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో దంచికొట్టగా, మిగిలినచోట్ల ముసురు కురిసింది. అత్యధికంగా హయత్​నగర్​లో 3.78 సెంటీమీటర్ల వాన పడింది. ఆఫీసులకు వెళ్లి, వచ్చే టైంలో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్​సర్కిల్​నుంచి వరంగల్​వెళ్లే రూట్​లో, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్, లంగర్ హౌస్, టోలిచౌకి రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. క్షేత్ర స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. 

వర్షాల నేపథ్యంలో శనివారం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్లతో మేయర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచించారు. సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 040--–21111111ను సంప్రదించాలన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్​24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్టాటిక్, మాన్సూన్ టీమ్స్​ఎప్పటికప్పుడు నీటిని తొలగిస్తున్నాయని కమిషనర్​ఆమ్రపాలి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈసీ, మూసీ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. 

జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. చేవెళ్ల, వికారాబాద్, శంకరపల్లి, ముమాన్ పల్లి, దోబీపేట నుంచి మూసీ ద్వారా గండిపేట జలాశయానికి వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కు చేవెళ్ల, అందాపూర్, కొత్వాల్ పేట, నర్కూడ, తాండూరు, మొయినాబాద్ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలర్ట్​అయ్యారు. 

రంగారెడ్డి జిల్లా కలెక్టర్​శశాంక కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించారు. అత్యవసరమైతే 040--– 23237416కు కాల్​చేయాలని సూచించారు. ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఎల్లో అలర్ట్(6.45 సెం.మీ. నుంచి 11.55 సెం.మీ.) జారీ చేశారు. 


ప్రాంతం    వర్షపాతం
    (సెం.మీ.లలో)
హయత్​నగర్​3.78
వనస్థలిపురం     3.60
సరూర్​నగర్    3.60
బండ్లగూడ    3.53
ఉప్పల్​    3.50
ముషీరాబాద్​    3.40
కంచన్​బాగ్    3.40
సైదాబాద్​    3.38
మారేడ్​పల్లి    3.25
చార్మినార్​    3.25
మల్కాజిగిరి    3.25
కుత్బుల్లాపూర్​2.80
షేక్​పేట    2.78
కూకట్​పల్లి    2.63
రాజేంద్రనగర్​2.55
బాలానగర్​    2.45